Telangana Floods: వాగులో కిలోమీటర్ కొట్టుకుపోయారు.. ప్రాణాలతో బయటపడ్డారు

తెలంగాణలో గత మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడిక్కడ చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వరద ధాటికి ప్రజలు..

Telangana Floods: వాగులో కిలోమీటర్ కొట్టుకుపోయారు.. ప్రాణాలతో బయటపడ్డారు

Telangana Floods

Updated On : September 6, 2021 / 6:43 AM IST

Telangana Floods: తెలంగాణలో గత మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడిక్కడ చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వరద ధాటికి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు పిల్లలు పొలం నుండి ఇంటికి వస్తుండగా ఎడ్లబండితో సహా వాగులో కొట్టుకుపోయారు. అలా కిలోమీటర్ వాగులోనే కొట్టుపోయిన అనంతరం స్థానికుల సాయంతో బ్రతికి బయటపడ్డారు.

నేరడిగొండ మండలం శంకరాపూర్​కు చెందిన 12 ఏళ్ల రజనీకాంత్, 14 ఏళ్ల కృష్ణ అనే ఇద్దరు పిల్లలు తమ సమీపంలోని పంట పొలానికి వెళ్లారు. సాయంత్రం పొలంలో ఉండగానే భారీగా వర్షం కురవడంతో తగ్గేవరకు అక్కడే వేచి ఉన్నారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో రెండు ఎడ్ల జతలతో ఎడ్లబండి కట్టుకొని ఇంటికి బయల్దేరారు. అయితే, అప్పటికే కురిసిన భారీ వర్షానికి గ్రామ సమీపంలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

వాగు అంత ఉదృతంగా ప్రవహిస్తున్నా ఎడ్ల మీద నమ్మకంతో బండిని వాగులో దించారు. నీటి ప్రవాహం అనుకున్నదానికన్నా ఎక్కువగా ఉండడంతో పిల్లలు ఇద్దరూ బండితో సహా వాగులో కొట్టుకుపోయారు. అలా దాదాపు కిలోమీటర్ దూరం కొట్టుకుపోయిన అనంతరం గమనించిన స్థానికులు కష్టపడి వాళ్లను కాపాడారు. ఇక వారితో పాటు వాగులో కొట్టుకుపోయిన రెండు ఎడ్లలో ఒక ఎద్దు చనిపోగా ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.