కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు పట్టిన శని.. వాటి పీడ వదిలించాలి: కిషన్ రెడ్డి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు పట్టిన శని.. వాటి పీడ వదిలించాలి: కిషన్ రెడ్డి

Updated On : June 2, 2025 / 12:59 PM IST

తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ శనిలా పట్టుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలు తెలంగాణను నిలువునా దోపిడీ చేస్తున్నాయని, ప్రజలు తెలంగాణను రక్షించుకునేందుకు సన్నద్ధం కావాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అంకతభావంతో పనిచేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటమీద నిలబడుతామని చెప్పారు.

Also Read: 9 మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అందించిన సీఎం రేవంత్

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పీడను వదిలించుకొని, ప్రజలు మరో పీడను తగిలించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అవినీతి దోపిడీ పార్టీల నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉందని చెప్పారు.

తెలంగాణ పోరాటం ప్రపంచ చరిత్రలో లిఖించదగ్గ పోరాటమని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన కోసం బలిదానం చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసిన పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీ అని అన్నారు.

తెలంగాణ ఆవిర్భావం తరువాత నీళ్ల పేరుతో, నిధుల పేరుతో, నియామకాల పేరుతో దోపిడి జరిగిందని తెలిపారు. తెలంగాణ ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ పనిచేయలేదని అన్నారు. 11 ఏళ్ల తరువాత తెలంగాణ ఏ విధంగా ఉందో ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. అప్పట్లో కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తామన్నారని, పదేళ్ల తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ అయ్యిందని ఎద్దేవా చేశారు.