వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చేయడం తప్పే, కానీ..- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

అసలు సమస్య ఏంటో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. అది ఆయన బాధ్యత.

వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చేయడం తప్పే, కానీ..- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Kishan Reddy On Vikarabad Incident (Photo Credit : Google)

Updated On : November 14, 2024 / 6:09 PM IST

వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కలెక్టర్, అధికారులపై దాడి చేయడం తప్పు అన్న ఆయన.. దాడి ఘటనను ఖండించారు. అదే సమయంలో దాడి చేశారని సామాన్యులపై అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో వారిపై కేసులు పెట్టాలన్నారు. దాడి జరిగిన ప్రదేశం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉందని.. అక్కడికి వెళ్లి ఆయన సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. తాము ఎవరితోనూ కలవలేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలతోనే తామున్నామని తేల్చి చెప్పారాయన.

”కలెక్టర్ మీద ఆ రకంగా దాడి జరగడం తప్పు. కానీ, అమాయక గ్రామీణ ప్రజలందరిపైనా అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదు. ఎవరైతే వారిని రెచ్చగొట్టారో వారిపై దృష్టి పెట్టండి. అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి మాట్లాడాలి. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత ఉంది. అసలు సమస్య ఏంటో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. అది ఆయన బాధ్యత. ఇవాళ కలెక్టర్ పై దాడి జరగటం, అనేక మందిపై కేసులు పెట్టడం, దీన్ని ప్రచార అంశంగా వాడుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇది” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మరోవైపు వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో ఉన్నత స్థాయి దర్యాఫ్తు జరుగుతోంది. పరిగి పోలీస్ స్టేషన్ కు అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఐజీ సత్యనారాయణ వెళ్లారు. దాడి వెనకున్న కుట్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు పరిగి పీఎస్ వద్ద రెండు వ్యాన్లలో పోలీసు బలగాలను మోహరించారు.

వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసును రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. దీని వెనకున్న వారిని వదిలిపెట్టేది లేదంటోంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్. ఇక, పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేరు బయటకు రావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నింపింది. దీనిపై ఉన్నత స్థాయి అధికారుల దర్యాఫ్తు జరుగుతోంది.

Also Read : వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలనం..!