Vaccine Testing Center : హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్.. దేశంలోనే మూడోది..
హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

Vaccine Testing Center
Vaccine Testing Center : హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ నుంచి నిధులను విడుదల చేసిందని తెలిపారు. బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు.
దేశంలో ఇప్పటిదాకా కేవలం రెండే టెస్టింగ్ ల్యాబ్ లు ఉన్నాయని, ఇప్పుడు మూడో ల్యాబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధి, పరిశోధనలో దేశానికి హైదరాబాద్ తలమానికంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఫార్మా రంగం సమగ్రాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. దాంతోపాటు హైదరాబాద్ లో వ్యాక్సిన్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ కోసం నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సీరం, భారత్ బయోటెక్ లు వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మరికొన్ని సంస్థలు కూడా వ్యాక్సిన్ పై ట్రయల్స్ జరుపుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపడం గొప్ప విషయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.