Vijayashanthi : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు..! విజయశాంతి కీలక వ్యాఖ్యలు
Vijayashanthi : పార్టీ అధికార ప్రతినిధుల నుంచి మాత్రమే కచ్చితమైన సమాచారం లేదా ప్రకటన వస్తుంది.

Vijayashanthi (Photo : Twitter, Google)
Vijayashanthi – Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. బీజేపీ చీఫ్ ని మార్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి మరొకరికి అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అధ్యక్ష పదవి మార్పు వార్తల్లో నిజం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీని దెబ్బకొట్టేందుకు అదంతా ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంగా అభివర్ణిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వార్తలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి స్పందించారు.
” బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా లీకేజీలు సరి కాదు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుగ్ గతంలో చెప్పిన అంశం మాత్రమే ఇప్పటికీ అధికార పూర్వకం. నేతల భేటీలపై ఊహాగానాలతో వెలువడే మీడియా కథనాలు, సమాచారం ఎప్పటికీ అధికార ప్రకటనలు కానే కావు. వీటి ప్రభావం పార్టీపైనా, ప్రజల్లోనూ ఉండదు. పార్టీ అధికార ప్రతినిధుల నుంచి మాత్రమే కచ్చితమైన సమాచారం లేదా ప్రకటన వస్తుంది. ఎవరికైనా అదే అధికారికం అవుతుంది తప్ప ఊహాజనిత వార్తలు కాదు” అని విజయశాంతి ట్వీట్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు వార్తలపై బండి సంజయ్ కూడా స్పందించారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించి, కేంద్రమంత్రి పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారాయన. అది తప్పుడు ప్రచారం అన్నారు. మా పార్టీలో అలాంటి లీకులు ఉండవు అని బండి సంజయ్ తేల్చి చెప్పారు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రమంత్రి పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికైనా దక్కినప్పుడు వారి పేర్లు బయటకు వచ్చాయా? అని బండి సంజయ్ అడిగారు.
Also Read..Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్
మరోవైపు బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ సీనియర్ల సమావేశం జరిగింది. పార్టీలో పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు జితేందర్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలోనే రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయికి చేరిందని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. పార్టీ విషయాలు బయటకు లీక్ కాకుండా చూడాలని నిర్ణయించుకున్న నేతలు.. పార్టీలో పరిణామాలపై అధిష్టానానికి లేఖ రాసే యోచనలో ఉన్నట్లు సమాచారం.