Dengue Fever In GHMC Area : జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం – డెంగీ వ్యాధితో మహిళా డాక్టర్ మృతి
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా,వంటి విషవ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువ డాక్టర్ డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.

Viral Fevers
Dengue Fever In GHMC Area : హైదరాబాద్‌లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం వర్షాలతో జనావాసాల మధ్య అక్కడక్కడ నీరు నిలుస్తుండటంతో దోమల సమస్య పెరగటంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1811 కేసులు నమోదు కాగా వాటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 594 కేసులు నమోదయ్యాయి. అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా డెంగ్యూ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది.సీజనల్ వ్యాధులతో పాటు విషజ్వరాలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా,టైఫాయిడ్ వంటి విషవ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువ డాక్టర్ డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
జీడిమెట్ల డివిజన్ లోని మీనాక్షి ఎస్టేట్ లో ఉండే అర్పిత రెడ్డి(32) అనే డాక్టర్ స్ధానికంగా ఉండే ఆస్పత్రిలో విధులునిర్వహిస్తోంది. 5 రోజుల క్రితం ఆమెకు జ్వరం రావటంతో నగరంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. పరీక్షలునిర్వహించగా డెంగీ గా తేలింది. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం కన్నుమూసింది. నిజామాబాదా జిల్లాకు చెందిన ఈమెకు ఒక కూతురు ఉంది. డాక్టర్ కే డెంగీ వ్యాధిసోకి మరణించటం స్ధానికంగా కలకలం రేపింది.
కాలానికనుగుణంగా మురికివాడల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య అధికారులు పత్తా లేకుండా పోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో చెత్తా చెదారాలకు తోడు ఆయా ప్రాంతాల్లో పందులు, దోమల బెడద అధికంగా ఉంది. మలేరియా సిబ్బంది తూతూ మంత్రంగా కాలనీల్లో పర్యటిస్తూ పనులు చేస్తున్నా దోమలు విజృంభిస్తున్నాయి.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయి.
ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో విష జ్వరాలు సోకడం వల్ల మరింత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. మీనాక్షి ప్రాంతానికి చెందిన ఓ మహిళ సుచిత్ర సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతుండగా, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పేట్‌బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడినట్లు తెలుస్తోంది. స్థానికంగా పారిశుద్ధ్యం విషయంలో జంట సర్కిల్ వైద్యాధికారులు తమ పరిధి కాదన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారనేవిమర్శలు తలెత్తుతున్నాయి.