Weather Updates : ఏపీ, తెలంగాణ ప్రజలకు కోల్డ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఇక గడ్డకట్టుకుపోవడమే…
Weather Updates : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలితీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
weather update
Weather Updates : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలితీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా గత రెండుమూడు రోజుల నుంచి పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గాయి.
సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 8గంటల వరకు దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వారంరోజులపాటు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలి తీవ్రతను తట్టుకొనేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న వారం పదిరోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా అవుతుందని, ముఖ్యంగా వచ్చే నాలుగు రోజులు (10 నుంచి 13వ తేదీ వరకు) చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.2డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ చలిగాలులు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈనెల 16వ తేదీ వరకు చలిగాలులు ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా జగిత్యాల, సంగారెడ్డి, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోనూ చలి పంజా విసురుతోంది. శేరిలింగంపల్లిలో సోమవారం ఉదయం 8.30గంటలకు చలి తీవ్రత 8.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాజేంద్రనగర్ ప్రాంతంలో 10.1, రామచంద్రాపురంలో 10.6, చందానగర్లో 11.0 డిగ్రీలుగా నమోదైంది. వచ్చే నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో 15డిగ్రీలకన్నా తక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.
చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు తప్పనిసరిగా వెచ్చటి దుస్తులు ధరించాలని, అత్యవసరం అయితే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచించారు.
