YS Sharmila: రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన హరీశ్ రావుకు వైఎస్ షర్మిల కౌంటర్

ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే.

YS Sharmila: రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన హరీశ్ రావుకు వైఎస్ షర్మిల కౌంటర్

YS Sharmila

Updated On : July 3, 2023 / 7:08 PM IST

YS Sharmila – Kaleshwaram: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన తెలంగాణ (Telangana) మంత్రి హరీశ్ రావు(Harish Rao Thanneeru)కు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం పెద్ద జోక్ అంటూ హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టును, బీఆర్ఎస్ చేస్తోన్న వ్యాఖ్యలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. తెలంగాణను అప్పుల పాలు చేసి, కాళేశ్వరం కమీషన్లతో దేశ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అటువంటి బీఆర్ఎస్ బందిపోట్లు ప్రాజెక్ట్ అవినీతిపై కొత్త పాట పాడటం విడ్డూరంగా ఉందని షర్మిల అన్నారు. రూ.80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు ఎలా కొట్టేస్తామని చేస్తున్న వితండవాదం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని చెప్పారు.

తెలంగాణను దోచుకుతిన్న దొంగలు కాగ్ (CAG) నివేదికనే తప్పుదోవ పట్టిస్తున్నారని షర్మిల చెప్పారు. రూ.62 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.1,51,168 కోట్లకు పెంచారని, నెలకు రూ.2,100 కోట్లు ఎలా కడతారని కాగ్ తూర్పారపెట్టిందని అన్నారు. దీనిపై సమాధానం చెప్పే దమ్ము లేదని అన్నారు. ప్రశ్నించే వారిపై అక్కసు వెళ్లగక్కడం మాత్రమే బీఆర్ఎస్ (BRS)కు తెలుసని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలో కేసీఆర్ చేసిన రూ.లక్ష కోట్ల మెగా కుంభకోణంపై పోరాటం చేస్తున్నది కేవలం తమ పార్టీ మాత్రమేనని షర్మిల అన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిపై ఢిల్లీ వరకు పోరాడి సీబీఐ, కాగ్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేంద్ర సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం పెద్ద జోక్- రాహుల్ గాంధీకి మంత్రి హరీశ్ రావు కౌంటర్