YS Sharmila: షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు.. విలీనానికి అంతా సిద్ధమా?

ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒక‌ట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియ‌పై ప్రక‌ట‌న విడుదలయ్యే అవ‌కాశం ఉన్నట్లు చెబుతున్నారు.

YS Sharmila: షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు.. విలీనానికి అంతా సిద్ధమా?

YS Sharmila

YS Sharmila – Congress: వైఎస్‌ఆర్ బాణం షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనానికి రంగం సిద్ధమవుతోందట..! తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని వైఎస్‌ఆర్‌టీపీని (YSRTP) ప్రారంభించిన షర్మిల.. ఒంటరిగా పోరాటం చేయడం కన్నా.. తన తండ్రిని ఆదరించిన పార్టీలో చేరిపోవాలని డిసైడ్ అయ్యారట..! అధికార బీఆర్‌ఎస్‌తో (BRS Party) పాటు కాంగ్రెస్, బీజేపీలపై రాజీలేని పోరాటం చేస్తానని పార్టీని పెట్టిన షర్మిల రెండేళ్లు గడవకముందే.. ఒక్క ఎలక్షన్ కూడా ఎదుర్కోకుండానే కాంగ్రెస్ హస్తాన్ని అందుకోడానికి కారణమేంటి? షర్మిల-కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు?

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని (YSR Telangana Party) కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి స‌మ‌యం ఆస‌న్నమైంది. గ‌త కొంతకాలంగా కాంగ్రెస్ వైపు చూస్తున్న ష‌ర్మిల.. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ష‌ర్మిల‌ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల కూడా కాంగ్రెస్ నుంచి తనకు మిస్డ్ కాల్స్ వచ్చినట్లు గతంలో చెప్పారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) రంగంలోకి దిగి.. షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నెరిపారని.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి అంతా సిద్ధం చేశారని చెబుతున్నారు.

రెండేళ్ల క్రితం తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా 2021 జూలై 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించారు ష‌ర్మిల. ఆ త‌ర్వాత తండ్రి మార్గంలోనే తెలంగాణ‌ వ్యాప్తంగా పాద‌యాత్ర చేశారు. దాదాపు 4 వేల కిలోమీట‌ర్లకు పైగా పాద‌యాత్ర చేసినా పెద్దగా మైలేజ్ రాలేదని భావించిన షర్మిల.. ఇతర పార్టీలతో పొత్తుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీకి ఆకర్షితులయ్యారు షర్మిల. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో (DK Shiva Kumar) రెండు సార్లు సమావేశమైన పొత్తు ప్రస్తావన తెచ్చారు. ఐతే తన కుటుంబ సన్నిహితుడు, తండ్రి స్నేహితుడు కేవీపీ రంగంలోకి దిగాక పొత్తు ప్రస్తావన పక్కన పెట్టి.. విలీన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. పకడ్బందీగా తెరవెనుక రాజకీయం నెరిపిన కేవీపీ.. షర్మిలను ఒప్పించి కాంగ్రెస్‌లో విలీనానికి రెడీ చేశారు. ష‌ర్మిల‌ ద్వారా వైఎస్ ఇమేజ్‌ను ఉప‌యోగించుకుని తెలంగాణతోపాటు ఏపీలోనూ బలపడవచ్చని కేవీపీ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

Also Read: జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తారా.. కేటీఆర్‌తో భేటీ అందుకేనా?

ష‌ర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే స్వరాష్ట్ర పాల‌న కోస‌మ‌ని మ‌ళ్లీ ష‌ర్మిలని తేవడం ద్వారా ఆ లక్ష్యం దెబ్బతింటుందని అడ్డు చెప్పారు రేవంత్.. ఐతే ఎన్నికలు సమీపిస్తున్నందున కలిసివచ్చిన ప్రతి ఒక్కరినీ కలుపుకోడానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించడంతో రేవంత్ మెత్తబడినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేకంగా చెప్పడంతో రేవంత్ రెడ్డి ఎదురు చెప్పలేక.. షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: బీఆర్‌ఎస్‌లో వారసుల సందడి.. విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లు.. కుదరదంటున్న కేసీఆర్

మొత్తానికి ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒక‌ట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియ‌పై ప్రక‌ట‌న విడుదలయ్యే అవ‌కాశం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న షర్మిలకు ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలో దింపనున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమచారం. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె సేవలను పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకోవాలని అప్పుడు ఏపీకి పంపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తోందని అంటున్నారు.