నకిలీ ఓట్లు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. సంతకంతో డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ ఈసీ లేఖ.. మళ్లీ స్పందించిన రాహుల్

ఓట్ల చోరీ అంటూ చేసిన ఆరోపణపై రాహుల్ గాంధీ ఆధారాలతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఈసీ పేర్కొంది. 

నకిలీ ఓట్లు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. సంతకంతో డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ ఈసీ లేఖ.. మళ్లీ స్పందించిన రాహుల్

Updated On : August 7, 2025 / 9:02 PM IST

దేశంలోని అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్ల పేర్లు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎగ్జిట్‌ పోల్స్‌తో పాటు ఒపీనియన్‌ పోల్స్‌కు వ్యతిరేకంగా ఎలక్షన్ల రిజల్ట్స్ వస్తున్నాయని అన్నారు.

మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా బ్లాక్ కి చాలా కాలంగా ఓటర్ల జాబితాపై అనుమానం ఉందని, ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నిర్ధారణ జరిగిందని అన్నారు.

మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని రాహుల్ గాంధీ చెప్పారు. ఓటర్ల లిస్టును తమకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని తెలిపారు. అలాగే, కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లకు గాను లక్ష ఓట్లు నకిలీవని చెప్పారు. అలాగే, బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభతో పాటు మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల లిస్టును చూస్తే నకిలీ ఓటర్లు ఉన్నట్లు తేలిందని తెలిపారు.

రాహుల్‌ గాంధీ ఆరోపణలపై కర్ణాటక చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ కార్యాలయం స్పందించింది. ఓటర్ల లిస్టులో అనర్హులను చేర్చారంటూ, అర్హులను మినహాయించారంటూ ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. ఆయా ఓటర్ల వివరాలను డిక్లరేషన్‌ రూపంలో ఇవ్వాలంటూ ఆయనకు లేఖ రాసింది. దీంతో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

ఓట్ల చోరీ అంటూ చేసిన ఆరోపణపై రాహుల్ గాంధీ ఆధారాలతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది.  చర్యలు ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ నుంచి సంతకంతో కూడిన డిక్లరేషన్‌ను కోరుతున్నట్లు పేర్కొంది.

ఓటర్ల జాబితాను పారదర్శకంగానే తయారు చేసినట్టు పేర్కొన్న కర్ణాటక ఎన్నికల అధికారులు.. ఎన్నికల ఫలితాలను కేవలం కోర్టులో ఎన్నికల పిటిషన్ ద్వారానే ప్రశ్నించవచ్చని తెలిపారు.

“మీరు రూల్ 20(3)(b) ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్, 1960 ప్రకారం సంతకం చేసిన డిక్లరేషన్ / ఓత్ సంబంధిత ఓటర్ల పేర్లను సమర్పించండి. తద్వారా అవసరమైన ప్రక్రియలు ప్రారంభించవచ్చు” అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇదే రూల్ 20(3)(b) ప్రకారం రాహుల్ గాంధీకి లేఖ రాసింది.

వీటిపై స్పందించిన రాహుల్ గాంధీ.. “నేను అందరి ముందు బహిరంగంగా చెబుతున్నాను. దీన్నే ఓథ్‌గా తీసుకోండి. ఇది ఎన్నికల సంఘం డేటా, దాన్నే మీకు మేము చూపిస్తున్నాం. ఇది మా డేటా కాదు” అని అన్నారు.

“విషయం ఏంటంటే, ఈ సమాచారం తప్పు అని ఈసీ అనలేదు” అని కూడా చెప్పారు. “నేను రాజకీయ నాయకుడిని. నేను ప్రజలతో ఏది చెబితే అదే నా మాట. ఇది ఈసీ డేటా. దీనిని ఈసీ తప్పు అనడంలేదు. ‘ఇది తప్పు’ అని ఈసీ ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే ఈసీకి నిజం తెలుసు” అని రాహుల్ చెప్పారు.