మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దు.. నగరి వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
ఇలా.. ఒకేరోజు మంత్రి రోజాకు వ్యతిరేకంగా రెండు ఘటనలు జరగడం జిల్లాలో సంచలనంగా మారింది.

ZPTC Members Allegations On Minister Roja Selvamani
Minister Roja : చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు అసమ్మతి స్వరం వినిపించారు. కక్ష సాధింపుతో మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నగరి నియోజకవర్గ వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, నిండ్ర మండలం జడ్పీటీసీ మల్లీశ్వరి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి రోజా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, పనులు జరగనివ్వడం లేదని ఆరోపించారు.
జడ్పీ భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు తమకు గదులు కేటాయించలేదని వారు వాపోయారు. మాకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఓట్లు వేసి మంత్రి రోజాను గెలిపించడమే మేము చేసిన పాపం అంటూ వాపోయారు. ఈ ఎన్నికల్లో మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ ను వారు కోరారు. రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గెలిపిస్తాము అని చెప్పారు. జగన్ ముద్దు రోజా వద్దు అనే నినాదం వినిపించారు ఆ ఇద్దరు జెడ్పీటీసీలు.
Also Read : రూ.40 లక్షలు తీసుకున్నారు..! మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు
జెడ్పీటీసీ అయిన తమకు సొంత పార్టీకి చెందినప్పటికీ తమకు మంత్రి రోజా గౌరవం లేకుండా చేస్తున్నారని వారు వాపోయారు. తమ మండలాల్లో కుర్చీ కూడా లేకుండా చేస్తున్నారని, ఏ పనులు చేయకుండా మంత్రి రోజా అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు. దీనిపై వారు జెడ్పీ ఛైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశారు.
అటు.. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఆశ చూపి మంత్రి రోజా సోదరుడు 40లక్షలు తీసుకున్నారని, అయినా పదవి మాత్రం ఇవ్వలేదని పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. పదవి ఇవ్వకపోగా, డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం లేదని భువనేశ్వరి వాపోయారు. జగనన్నే తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇలా.. ఒకేరోజు మంత్రి రోజాకు వ్యతిరేకంగా రెండు ఘటనలు జరగడం జిల్లాలో సంచలనంగా మారింది.
Also Read : రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి