ట్రెండింగ్‌లో #GetWellSoonSPB.. దేశవ్యాప్తంగా ప్రార్థనలు..

  • Published By: sekhar ,Published On : August 20, 2020 / 08:48 PM IST
ట్రెండింగ్‌లో #GetWellSoonSPB.. దేశవ్యాప్తంగా ప్రార్థనలు..

Updated On : August 21, 2020 / 11:50 AM IST

#GetWellSoonSPB: సుప్రసిద్ధ గాయకులు, గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సామన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తున్నారు. కాగా నేడు సంగీత కళాకారులు, బాలు అభిమానులు ఆయనకోసం ప్రార్థనలు చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా వున్న బాలు అభిమానులు ప్రార్థనలు చేశారు.

తమిళనాడులో బాలు కోలుకోవాలని దీపాలతో ప్రార్థనలు చేశారు. ఇక సోషల్ మీడియాలో, దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా #GetWellSoonSPB, #GetWellSoonSPBSIR హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. లోకల్ మొదలుకుని నేషనల్ మీడియా వరకు బాలు ఆరోగ్యం గురించి, అభిమానులు చేస్తున్న ప్రార్థనల గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

నిన్నటివరకు మన మధ్య తిరిగిన వ్యక్తి.. ఐదు దశాబ్దాలుగా తన గానమాధుర్యంతో తెలుగుతోపాటు ఇతర భాషల ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్న బాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలియగానే ప్రతిఒక్కరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.. బాలు గొంతు మళ్లీ వినిపించాలంటూ దేవుణ్ణి వేడుకుంటున్నారు.. దీన్ని బట్టి ఆయన ఎంతటి అభిమాన గణాన్ని సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.. బాలు త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో సంగీత ప్రంపంచంలో మరిన్ని సంచలనాలు సృష్టించాలని మనసారా కోరుకుందాం..

Get Well Soon SPB