ఏపీ కేబినెట్ భేటీ : కీలక అంశాలపై చర్చ

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 01:06 AM IST
ఏపీ కేబినెట్ భేటీ : కీలక అంశాలపై చర్చ

Updated On : February 25, 2019 / 1:06 AM IST

ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేసేందుకు ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం మంత్రి వర్గం భేటీ కాబోతుంది. రైతుల ప్రయోజనాలు, అగ్రిగోల్డ్ పరిహారంతో పాటు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పదోన్నతులతో పాటు పలు కీలక అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

ఉదయం పదిన్నరకు సమావేశం జరుగనుంది. సమావేశం ప్రారంభం కాగానే పుల్వామా దాడిలో మృతి చెందిన జవాన్లకు కేబినేట్ సంతాపం తెలపనుంది. ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబుపై బీజేపీ చేస్తున్న విమర్శలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. రైతులకు రుణమాఫీ నిధుల విడుదల చెల్లింపునకు ఆమోద ముద్ర వేయనుంది. ఏడున్నర వేల కోట్లు రైతులకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి రెండు విడతల్లో చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అన్నదాత సుఖీభవ పధకం కింద 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం ఇస్తున్న 6వేలకు మరో 9వేలు కలిపి 15వేలు ఇవ్వనుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తామే సొంతగా 10వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ పథకం నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అర్చకుల ఆధీనంలో ఉన్న భూములకు సైతం అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. 20 ఏళ్ళు సర్వీసు దాటిన కానిస్టేబుల్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించనుంది. దీనివల్ల 1259 మందికి పదోన్నతి రానుంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించేందుకు ఇప్పటికే ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసింది. వీలైనంత తొందరగా చెల్లింపులు చేయడంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో పలు సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.