ఢీ అంటే ఢీ : TDP MP అభ్యర్థులు వెనుకబడ్డారా

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై TDPలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పోటీ చేసిన అభ్యర్థులు అందరూ.. తమ అధినేతను కలిసి పోలింగ్ వివరాలను అందజేస్తున్నారు. చంద్రబాబును కలిసిన నేతలందరూ ఈవీఎంల లోపాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అనంతరం పార్టీ ప్రత్యర్థితో పోల్చుకుంటే.. ఆర్థిక వ్యవహారాల్లో కొంత వెనుకబడిందని చెప్పుకొస్తున్నారు. నామినేషన్లు వేసినప్పుడు తమతో సరితూగే అభ్యర్థులేనా వీరు అనుకున్నవారు సైతం.. పోలింగ్ సమయంలో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరించారని .. నేతలు తమ అధినేతకు చెబుతున్నారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉందని.. గెలుపు ఓటములు పక్కనపెడితే జనసేన సైతం కొంత ఓటు బ్యాంకును తెచ్చుకుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. జనసేన ఓటుబ్యాంకు వలన ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీకి ఇబ్బంది అయితే, కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఇబ్బంది అని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఎస్సీ కేటగిరి నియోజకవర్గాల్లో టీడీపీ కొంత ఇబ్బంది పడిందని.. ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. వైసీపీ అధిష్టానం ఆ సీట్లను ప్రత్యేక దృష్టితో చూసిందని .. ఆ విధమైన లబ్ధి వైసీపీకి ఉంటుందేమో అనే అనుమానం టీడీపీ వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో.. పార్టీలో విపరీతమైన చర్చ జరుగుతోంది. నామినేషన్ల సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థులకు వైసీపీ అభ్యర్థులు కొందరు అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేరని అనుకున్నారు. కానీ పోలింగ్ నాటికి ఎక్కువమంది వైసీపీ పార్లమెంట్ అభ్యర్థులు .. టీడీపీ ఎంపీ అభ్యర్థులకు చుక్కలు చూపించారు. ఎన్నికలు ముగియడంతో టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.
పార్లమెంట్ అభ్యర్థులను పరిశీలిస్తే .. అరకు స్థానం నుంచి పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్‌కు వైసీపీ అభ్యర్థి జి. మాధవి గట్టిపోటీ ఇచ్చారు. అలాగే విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి అశోక్ గజపతిరాజుపై పోటీచేసిన వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఢీ అంటే ఢీ అనే విధంగా పోరాటం చేశారు. ఈజీగా గెలుస్తాం అనుకున్న వైజాగ్ స్థానంలోనూ భరత్‌కి చుక్కలు చూపించారు జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణ. వైజాగ్‌లో బీజేపీ తరపున పురందేశ్వరి, వైసీపీ తరపున ఎంవీ సత్యనారాయణ పోటీ చేశారు. మొదట టీడీపీ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. అనకాపల్లిలో సైతం ఆడారి ఆనంద్‌కు గట్టి పోటీ ఇచ్చారు వైసీపీ అభ్యర్థి సత్యవతి. రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి మాగంటి రూప గెలుపు ఖాయం అనుకున్నా.. వైసీపీ అభ్యర్థి మార్గాన్ని భరత్ .. హోరాహోరీ పోరాటం చేశారు. నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఆఖరి నిమిషంలో పోటీకి దిగిన కలవపూడి శివ .. అనేక అంశాల్లో ప్రత్యర్థులు కన్నా వెనుకబడ్డారు.
ఏలూరులో సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ గట్టి ఎన్నికల ప్రణాళికతో పోటీలో నిలిచారు. మచిలీపట్నంలో సైతం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయణను వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయారు వైసీపీ అభ్యర్థి బాలశౌరి. అదేవిధంగా నరసరావుపేటలో రాజకీయ ఉద్దండుడు రాయపాటి సాంబశివరావు సైతం .. ప్రత్యర్థి లావు కృష్ణ దేవరాయలు స్పీడ్‌తో కొంత ఇబ్బంది పడ్డారు. బాపట్ల పార్లమెంటులో సైతం వైసీపీ కొత్త అభ్యర్థి ఎం.సురేష్ సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రికి చుక్కలు చూపించారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి అయిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి.. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో వెనుకబడ్డారు. ఆమె ప్రత్యర్థి అయిన బల్లి దుర్గాప్రసాద్ గట్టి పోటీ ఇచ్చారు.
ఇక రాయలసీమలో సైతం మాకు మీరు పోటీ నా అనుకున్న చోట్ల కూడా .. చెమటోడ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి అధికార పార్టీ అభ్యర్థులకు వచ్చింది. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డితో ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడ్డారు వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి. అనంతపురం పార్లమెంట్‌లో సైతం జేసీ పవన్ గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు టీడీపీ నేతలు. కానీ అక్కడ వైసీపీ అభ్యర్థి అయిన తలారి రంగయ్య అనూహ్యంగా గట్టి పోటీ ఇచ్చారు. హిందూపురంలో సైతం సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చెమటలు పట్టించారు.. వైసీపీ అభ్యర్థి మాజీ పోలీసు అధికారి మాధవ్. గెలుపు సునాయాసమే అనుకున్న ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీరి శ్రమ ఫలించిందా లేదా ప్రత్యర్థులతో రేసులో వెనకబడ్డారా అన్నది తేలాలంటే ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.