టి.కాంగ్రెస్‌కి మరో దెబ్బ : TRSలో చేరుతున్నా – చిరుమర్తి లింగయ్య

ఈసారి అధికారంలోకి రావాలని కలలు కని బొక్కా బోర్లపడిన తెలంగాణ కాంగ్రెస్‌కి ఇంకా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన లీడర్లు షాక్‌లిస్తున్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మార్చి 09వ తేదీన తెలంగాణలో రాహుల్ అడుగు పెట్టి వెళ్లారో లేదో బిగ్ షాక్ తగిలింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాను త్వరలోనే టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
తాను పార్టీ మారబోతున్నట్లు స్వయంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. నల్గొండ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్లు వెల్లడించారాయన. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై మరోసారి గెలిచి చూపిస్తానని ప్రకటనలో వెల్లడించారు. జిల్లా అభివృద్ధి కేసీఆర్ వల్లే సాధ్యమని నమ్ముతున్నట్లు పేర్కొన్న ఆయన…కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు గుప్పించారు. సాగు నీటి ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు….యాదాద్రి పవర్ ప్లాంట్, ప్రాజెక్టులను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నా..కనీసం ఓడిపోయినా వారిలో మార్పు రావడం లేదని కాంగ్రెస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వీరవిధేయుడు. ఇతను పార్టీ మారుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా జరిగింది. గత 24గంటలుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడినట్లైంది. టీఆర్ఎస్‌లోకి చిరుమర్తి లింగయ్య వెళ్లేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ హస్తం ఉండి ఉండొచ్చనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది.