బాబు ఢిల్లీ టూర్ : బీజేపీయేతర పక్షాల మీటింగ్

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 01:26 AM IST
బాబు ఢిల్లీ టూర్ : బీజేపీయేతర పక్షాల మీటింగ్

Updated On : February 27, 2019 / 1:26 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీయేతర పక్షాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్‌ విడుదల కానుండటంతో బీజేపీయేతర పక్షాలు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నాయి. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రీ-పోల్ అలయెన్స్‌కు ఒకే చెప్పిన పార్టీలు…సమావేశంలో ఎన్నికల కార్యాచరణను ప్రకటించనున్నాయి. ఎన్డీఎకు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న కూటమిలో ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలు పూర్తి స్థాయిలో తమ ఆమోదాన్ని ప్రకటించలేదు. ఆయా పార్టీలను ఎలా కలుపుకుని వెళ్లాలన్న అంశాలపై ఈ సమావేశంలో కసరత్తు చేయనున్నాయి.

ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావడానికి వెనుకడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా చూపాల్సిన పరిష్కారంపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంపై తీసుకురావాల్సిన ఒత్తిడి గురించి చర్చించే అవకాశం ఉంది. రాఫెల్‌ కుంభకోణం, పుల్వామా దాడిలో ఇంటిలిజెన్స్ వైఫల్యం, కేంద్రప్రభుత్వ అలసత్వం, ఉగ్రవాదుల శిబిరాలపై సైనికుల దాడి, ప్రభుత్వం తీసుకున్న చర్యల వంటి అంశాలపైన బీజేపీయేతర పార్టీలు చర్చించనున్నాయి. ఈవీఎంలపై రాష్ట్రపతిని కలిసి అభ్యంతరాలు తెలిపిన బీజేపీయేతర పార్టీలు….మరోసారి ఈవీఎంలపై చర్చించే ఛాన్స్ ఉంది.

ఏపీ భవన్‌ సాక్షిగా ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు చేసిన దీక్షకు..జాతీయ, ప్రాంతీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. తాజా సమావేశంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ధర్నాలు, ర్యాలీలు…ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపై పార్టీలు ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉంది. చివరి ధర్మ పోరాట సభను అమరావతిలో నిర్వహించి…మోడీపై యుద్ధాన్ని ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. 

మోడీకి మ్యాజిక్ ఫిగర్‌ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రీ-పోల్ అలయెన్స్ ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని పార్టీలు కలిసి రాకపోయినా…ఎన్నికలు అయ్యాక వస్తాయన్న ధీమాలో ఉన్నారు చంద్రబాబు. మోడీపై ఒత్తిడి పెంచాలన్న బీజేపీయేతర పార్టీల ప్లాన్‌…ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.