రాజధానిపై కొత్త చట్టం : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కార్యరూపం

మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 19, 2020 / 09:05 AM IST
రాజధానిపై కొత్త చట్టం : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కార్యరూపం

Updated On : January 19, 2020 / 9:05 AM IST

మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.

మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా.. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కొత్త చట్టాన్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్‌ పేరిట బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా తాము అనుకున్న విధంగా అధికార విధులను వికేంద్రీకరిస్తూ.. ఈ బిల్లును సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మొదట కేబినెట్ భేటీలో ఆమోద ముద్రవేసి.. ఆ వెంటనే అసెంబ్లీకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

జగన్ ప్రభుత్వం మొదటి నుంచి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశాక.. జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల నివేదికలు అదే తరహా సిఫార్సులు చేశాయి. అయితే.. ఏపీలో మారుతున్న రాజకీయాలు, పెరుగుతున్న సెంటిమెంట్ల కారణంగా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. న్యాయపరంగా, రాజకీయంగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని భావిస్తోంది. ఈ సమస్యను మరింత సాగదీయకుండా సాధ్యమైనంత త్వరగా తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకు రావాలనుకుంటోంది. ఇందులో భాగంగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తోంది. 

ఇప్పటికే డ్రాఫ్ట్‌ బిల్లును సిద్ధం చేసిన అధికారులు.. న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశముందా అనే కోణంలో తుది సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీలోని మూడు ప్రాంతాలను జోన్లుగా ఏర్పాటు చేస్తూ బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 13 జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించి బోర్డులు ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను ఉత్తర కోస్తా జోన్‌గా.. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలను మధ్య కోస్తా జోన్‌గా… గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దక్షిణకోస్తా జోన్‌గా.. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను రాయలసీమ జోన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిజోన్‌కు 9మంది సభ్యులతో ఓ బోర్డ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతిబోర్డులో ఛైర్మన్‌గా సీఎం, వైస్ ఛైర్మన్‌గా మరో వ్యక్తికి అవకాశం కల్పించనున్నారు. సభ్యులుగా ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నలుగురు ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఉంటుందని తెలుస్తోంది. ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి అధికారిని… బోర్డు కార్యదర్శిగా నియమించేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. 

అమరావతి ఏర్పాటు తర్వాత అమలులోకి వచ్చిన సీఆర్డీఏ చట్టంపై  ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలా? లేదంటే… సవరణలు చేయాలా అన్నదానిపై కసరత్తు చేస్తోంది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే.. రైతులు న్యాయపరంగా పోరాడే అవకాశం ఉంటుందా? ఉంటే.. ..అది ఏమేర ప్రభావం చూపిస్తుందనే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే… సీఆర్డీఏ చట్ట రద్దు బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టాలా? లేదంటే సాధారణ బిల్లుగా ప్రవేశ పెట్టాలా అనే దానిపైనా ఉన్నతస్థాయిలో చర్చలు జరిపింది ప్రభుత్వం. అయితే… రాజధాని విధుల వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో…. సీఆర్డీఏ చట్టం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.