వాలంటీర్లతో ప్రమాదం.. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడుతున్నారు: చంద్రబాబు

  • Published By: vamsi ,Published On : September 28, 2019 / 01:14 AM IST
వాలంటీర్లతో ప్రమాదం.. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడుతున్నారు: చంద్రబాబు

Updated On : September 28, 2019 / 1:14 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ వేధింపులకు చనిపోయిన మహిళ గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెన్ని చూడాలో అర్థం కావట్లేదని అన్నారు. అంతేకాదు వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని అన్నారు చంద్రబాబు. అసలు ఆ ఉద్యోగం వాళ్లకు ఇవ్వమని ఎవరడిగారంటూ జగన్‌ను నిలదీశారు.

రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాం అంటారా? అని మండిపడ్డారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు ఇచ్చి తామేదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చేసినట్లుగా ప్రభుత్వం కథలు చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వాలంటీర్లుగా నియమితులైన వాళ్లు అకృత్యాలు చేస్తున్నారని, ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లి డిస్టర్బ్ చేయడం, మగాళ్లు ఇళ్లల్లో లేనప్పుడు వెళ్లి డోర్లు కొట్టడం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటువంటి పనులు చేయడం ఎంత నీచమని ప్రశ్నించారు. వీటిని చూస్తుంటే ఎంతో బాధేస్తుందని, ఆవేదన, ఆవేశం వస్తుందన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ వేధింపుల కారణంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరైనా స్పందించారా? ప్రాణమంటే లెక్కలేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు.