శ్రీశైలం తెలంగాణ ఎత్తుకుపోతుంటే.. జగన్ సపోర్ట్ చేస్తాడా : చంద్రబాబు

కేసుల కోసం మోడీతో.. ఆస్తుల కోసం కేసిఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పోలవరంపై పదేపదే కేసులు వేసే కేసిఆర్‌తో జగన్ చేతులు కలుపుతారా? అంటూ విమర్శించారు. పోతిరెడ్డిపాడు నిలిపివేయాలనే టీఆర్‌ఎస్‌తో జగన్ లాలూచీ పడతారా? అని ప్రశ్నించారు. ముచ్చుమర్రి మూసెయ్యాలని, సాగర్, శ్రీశైలం తమకే ఇవ్వాలని అంటున్న కేసిఆర్‌కు జగన్ సపోర్ట్ చేస్తారా? అంటూ నిలదీశారు. సీమను ఎడారి చేయాలనే కేసిఆర్‌కు జగన్ మద్దతు ఎలా ఇస్తారు.
సొంత లాభాల కోసం జగన్.. కేసిఆర్‌తో కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలకు గండి కొడుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘ఒక్కసారి ప్లీజ్’ అంటూ వైసీపీ పెట్టే మొసలి కన్నీరుని నమ్మోద్దు అని చంద్రబాబు అన్నారు. ఒక్కసారి తినే తిండే కదా? అని తిండిలో విషం కలుపుకుంటామా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్ నుంచి వస్తున్న వలస పక్షుల మాటలు నమ్మొద్దని, హైదరాబాద్ వలస పక్షులకు ఆంధ్రప్రదేశ్‌లో ఏం పని అని ప్రశ్నించారు.
ఈ వలస పక్షులన్నీ హైదరాబాద్‌లో కేసీఆర్‌కు ఊడిగం చేసుకుంటే తప్పు లేదని, కానీ ఏపీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని తీవ్రస్వరంతో హెచ్చిరించారు. ఏపీకి వెళ్లి టీడీపీని ఓడించాలని కేసిఆర్ బెదిరించగానే వాళ్లంతా ఏపీలో వాలిపోతున్నారని చంద్రబాబు అన్నారు. పరాయి రాష్ట్రంలో బ్రతుకుతూ ఇక్కడకు వచ్చి మనల్ని తిడితే ఊరుకుందామా? అని చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.