ప్రత్యేక హోదా సంజీవని : అమీత్ జీ..నిధులు ఇప్పించండి

  • Published By: madhu ,Published On : October 23, 2019 / 12:35 AM IST
ప్రత్యేక హోదా సంజీవని : అమీత్ జీ..నిధులు ఇప్పించండి

Updated On : October 23, 2019 / 12:35 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ భేటీ ఫలప్రదమైందని వైసీపీ ప్రకటించింది. 2019, అక్టోబర్ 22వ తేదీ మంగళవారం దాదాపు 45నిమిషాల పాటు సాగిన భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్‌, అమిత్‌ షాతో చర్చించారు. పరిశ్రమలు పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణకు తరలిపోకుండా ఏపీకి రావాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అన్నారు జగన్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548 కోట్లకు ఆమోదించాలని అమిత్‌షాకు జగన్ విజ్ఞప్తి చేశారు. అందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కు ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ. 5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ. 838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని అమిత్‌షాకు సీఎం జగన్‌ తెలిపారు. హెడ్‌ వర్క్స్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ. 780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ. 58 కోట్లు ఆదా అయిన విషయాన్ని వివరించారు. 

నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్‌. గడచిన 50 ఏళ్లలో కృష్ణానదిలో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరోవైపు గోదావరిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్‌ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా సీఎం ప్రస్తావించారు.

వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు. బుందేల్‌ఖండ్, కలహండి తరహాలో ఏపీలోని వెనుకబడ్డ జిల్లాలకు నిధులివ్వాలని కోరారు. బకాయిపడ్డ రూ.1050కోట్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం రివర్స్ టెండర్ విధానంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. రూ. 838 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదాపై సంతోషం వ్యక్తం చేశారు. పోలవరంపై  ఇలాగే  ముందుకు వెళ్లాలని అమిత్ షా సూచించారు. ఏపీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా అమిత్‌షా భరోసా ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు ప్రకటించాయి. 
Read More : దటీజ్ ధర్మాడి : నేవీ, ఎన్డీఆర్ఎఫ్, టెక్నాలజీ చేయలేనిది సత్యం సాధించారు