గులాబీ గుబాళింపు : హూజూర్ నగర్‌కు రానున్న సీఎం కేసీఆర్

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో.. టీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43 వేల 358 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోట బద్ధలు కాగా..బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమన్..మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇదిలా ఉంటే..టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన వారికి కృతజ్ఞతలు తెలియచేసేందుకు సీఎం కేసీఆర్..2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం హూజూర్ నగర్ నియోజకవర్గానికి రానున్నారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హుజూర్‍నగర్‌లో ఏర్పాటు చేసిన కేసీఆర్ సభ.. వర్షం కారణంగా రద్దైంది. అయినప్పటికీ.. రికార్డ్ మెజారిటీ వచ్చింది. దీంతో.. ఓటర్లకు ధన్యవాదాలు చెప్పేందుకు గులాబీ దళపతి కేసీఆర్.. శనివారం హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటానని చెప్పారు.
ఈ నియోజకవర్గంలో గెలుపొందేకు టీఆర్ఎస్ పక్కా వ్యూహాలు రచించింది. పార్టీ నేతలు బైపోల్‌ను సీరియస్‌గా తీసుకునేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ.. సలహాలు, సూచనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా.. పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లేలా పావులు కదిపారు. ప్రతి 60 మంది ఓటర్లకు.. బూత్ స్థాయిలో ఓ సమన్వయకర్తను నియమించారు. వాళ్లంతా.. పక్క పార్టీల వైపు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ఇక.. రోడ్ షోల్లో.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి లాభమనే నినాదాన్ని కేటీఆర్ బలంగా తీసుకెళ్లారు. బైపోల్ ఇంచార్జ్.. పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా మిగతా నేతలంతా.. ఎన్నిక పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోనే మకాం వేశారు. వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టడంలో.. నాయకులు సక్సెస్ అయ్యారు.
అంతేగాకుండా..అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి.. ఉపఎన్నికకు ఇంచార్జ్‌ను కూడా నియమించేశారు. ఆ వెంటనే కొందరు పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో బాధ్యతలు అప్పగించారు. వాళ్లంతా గ్రామాల్లో బూత్ స్థాయి నుంచి ఓటర్ల వివరాలు సేకరించి.. పథకాల లబ్ధిదారులే లక్ష్యంగా ముందుకెళ్లారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ.. ఇచ్చిన పనిని సమర్ధవంతంగా పూర్తి చేశారు. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు హరీశ్ రావు, కవిత ప్రచారం చేయకపోయినా.. కేటీఆర్ గ్రౌండ్ లెవెల్లో తిరగకపోయినా.. హుజూర్ గ్రౌండ్‌లో టీఆర్ఎస్ విక్టరీ రీసౌండ్ వచ్చింది.
Read More : నేను స్వయంగా చెప్పే వరకు నమ్మొద్దు : హెల్త్ రూమర్స్ పై స్పందించిన హీరో