16 సీట్లే టార్గెట్ : లక్కీ ప్లేస్ నుంచి KCR ప్రచారం

తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే ప్రచారం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఆయన సమరశంఖారాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత మార్చి 19వ తేదీ మంగళవారం నిజామాబాద్‌లో జరిగే మరో సభలో పాల్గొంటారు. పార్టీ తరపున బరిలోకి దింపే ఎంపీల గెలుపే లక్ష్యంగా స్కెచ్ గీసేసారు కేసీఆర్. దానికి తగ్గట్లుగానే 16 లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసారు. ఈ ఇన్నింగ్స్ ఆరంభానికి కరీంనగర్‌ని వేదికగా మలచుకున్నారు టీఆర్ఎస్ సుప్రీం. ఒక్కో సభకు రెండు లక్షలకు తగ్గకుండా జనసమీకరణ జరగాలని ఆదేశించారు. అంతే కాకుండా… ఎంపీల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేల భుజస్కందాలపై మోపారు. ఇంకా టికెట్ ఎవరికీ కన్‌ఫామ్ చేయకపోవడంతో.. ఎవరిని దింపినా… భారీ మెజారిటీ వచ్చేలా పార్టీ కేడర్‌కు కేసీఆర్ సూచనలు చేయనున్నారు.
కేంద్రం తీరుపై గులాబీ బాస్ ఆగ్రహంగానే ఉన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తోందని గతంలో అనేకమార్లు మండిపడ్డారు. కరీంనగర్ వేదికపై నుంచి మరోమారు సెంట్రల్‌పై సెటైర్లు వేసే అవకాశం ఉంది. అంతే కాకుండా.. తెలంగాణకు కేంద్రం తీవ్రంగా అన్యాయం చేసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరం, ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందనే విషయాన్ని కరీంనగర్ వేదికపైనుంచే ఎండగట్టే అవకాశం ఉంది.
ఫెడరల్ ఫ్రంట్ భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఎన్నికలే కాబట్టి.. రైతుబందు స్కీమ్‌ను కేంద్రం కాపీ కొట్టిందనే విషయాన్ని ఈ సభా వేదిపై నుంచే కేసీఆర్ ఎక్స్‌పోజ్ చేసే అవకాశముంది. ఇక కేసీఆర్‌కు కరీంనగర్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఇక్కడి నుంచి పార్లమెంటుకు వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. అంతేకాదు, తాను సీఎం అయ్యాక మొదటగా పర్యటించింది కరీంనగర్‌లోనే. గతేడాది ఇక్కడి నుంచే ప్రతిష్ఠాత్మక రైతుబందు పథకాన్ని ప్రవేశపెట్టారు. 2001లో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చిన సింహగర్జన సభకు కూడా కరీంనగరే వేదికవుతోంది.