కష్టంగా ఉంది : అధికారులు ప్రభుత్వాన్నే శాసిస్తున్నారు

అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొందరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తిరుమల టీటీడీ అధికారులను దారికి తీసుకురావడంలో ప్రభుత్వ పెద్దలకు కొన్ని పరిమితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫైల్ పంపి 3 నెలలు అవుతుందని కేఈ అన్నారు.ఈ విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉందని సీఎం చంద్రబాబుతో చెప్పానన్నారు. ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయకుంటే సమస్యలు వస్తాయని కేఈ కృష్ణమూర్తి అన్నారు. తనకు రెవిన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖను నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు. దేవాదాయ శాఖను వదులుకోవాలని అనిపిస్తోందని కేఈ.కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.