బ్రేకింగ్ : ఏపీ చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో భారీ షాక్ ఇచ్చింది. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్‌చంద్ర పునేఠపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధులకు పునేఠను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. అనిల్‌చంద్ర స్థానంలో ఏపీకి కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను అపాయింట్ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా కొనసాగనున్నారు. అనిల్‌చంద్ర పునేఠకు ఎన్నికల విధులతో సంబంధం లేని బాధ్యతలను ఈసీ అప్పగించింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983 బ్యాచ్ కు చెందిన ఐఏస్ ఆఫీసర్. ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ యూత్ సర్వీసెస్ పోస్టులో ఉన్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ది చేసేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎస్ పునేఠపై ఈసీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పునేఠపై బదిలీ వేటు వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు.. ఇద్దరు ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై బదిలీ వేటు వేయడం హాట్ టాపిక్ గా మారింది.