రైతులను బ్రోకర్లు అనడంతో ఎమ్మార్వో వనజాక్షిపై తిరగబడ్డ రైతులు

  • Published By: vamsi ,Published On : February 17, 2020 / 10:58 AM IST
రైతులను బ్రోకర్లు అనడంతో ఎమ్మార్వో వనజాక్షిపై తిరగబడ్డ రైతులు

Updated On : February 17, 2020 / 10:58 AM IST

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చింతమనేని ప్రభాకర్ విషయంలో ఒక్కసారిగా పాపులర్ అయిన ఎమ్మార్వో వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఎమ్మార్వో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్రామసభలో గందరగోళం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వేమవరంలో ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు సభ ఏర్పాటు చేయగా.. సభలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ రైతుల తరపున మాట్లాడారు. సభ జరుగుతున్న సమయంలో ఎమ్మార్వో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలన్నారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు.

 రైతుల్ని బ్రోకర్లు అనడం ఏంటని ప్రశ్నించగా.. సభల గందరగోళం ఏర్పడింది. ఎమ్మార్వో క్షమాపణలు చెప్పాలని రైతులు, మహిళలు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఎమ్మార్వో బయటకు వస్తున్న సమయంలో ఆమెను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వనజాక్షిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో వనజాక్షి సంఘటనా స్థలం నుంచి బయట పడ్డారు. రైతులను బ్రోకర్లు అంటారా? అంటూ వనజాక్షి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.