కోర్టు మెట్లెక్కిన రైతులు: ఎన్నికలు వాయిదా వేయండి

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికపై రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల సంఘకు ఈ ఎన్నిక ఒక సవాల్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 170 మందికిపైగా పసుపు, ఎర్రజొన్న రైతులు ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్ నిర్వహించడం కష్టంగా మారింది. బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని అనుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని ఈసీ భావించింది. ఈ క్రమంలో దేశ చరిత్రలో తొలిసారిగా ఎం3 ఈవీఎంలతో నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో నామినేషన్ వేసిన రైతులు హై కోర్టు మెట్లెక్కారు. తమకు కేటాయించిన గుర్తులు ఎలా ఉంటాయో చెప్పకుండా ఎన్నికలకు వెళ్లమంటే ఎలా అని ప్రశ్నిస్తూ.. ఎన్నికను వాయిదా వేయాలంటూ రైతులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికను వాయిదా వేసి, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా రెండో విడతలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ ద్వారా రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.