జగన్‌పై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

  • Published By: vamsi ,Published On : March 27, 2019 / 03:08 AM IST
జగన్‌పై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Updated On : March 27, 2019 / 3:08 AM IST

జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందాక తనను సీఎం చేస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇస్తానని జగన్ చెప్పినట్టు ఆరోపించారు. జగన్‌కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఇలాంటి వ్యక్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జగన్ తన భవిష్యత్తును చక్కదిద్దుకుని ప్రజల భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. 
అలాగే ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి రామమందిరం గుర్తొస్తుందని, ఐదేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు మనకు బుర్ర లేదనుకుంటున్నారా? వాళ్లు ఏం చెబితే అది నమ్ముతాం అనుకుంటున్నారా? అని నిలదీశారు. ఆఖరికి తీవ్రవాదాన్ని, దేశ భద్రతను కూడా బీజేపీ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది సరిహద్దు రాష్ట్రమని, పాకిస్తానేంటో.. తీవ్రవాదమేంటో.. పూర్తిగా తెలుసునని చెప్పారు. రాజకీయం చేసి పబ్బం గడుపుకునేవాళ్లను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
దేవుడు మనకు అవకాశమిచ్చాడు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితాలను స్వర్గం చేసుకుంటామా? నరకం చేసుకుంటామా? అనేది మన చేతుల్లోనే ఉంది. తన సుదీర్ఘ అనుభవంతో ముస్లిం సోదరులకు, ఏపీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు వంటి విజన్ ఉన్న నేతకు మాత్రమే ఓటు వేయాలని అన్నారు.