నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్: వైసీపీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు

సినిమాల్లో విలన్ చేసే పనులు.. అధికారం చేతిలో ఉంది కదా? అని వైసీపీ ఎమ్మెల్యే కొడుకు నడిరోడ్డుపై బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తండ్రి ఎమ్మెల్యే.. సొంత పార్టీ అధికారంలో ఉంది అని రెచ్చిపోయాడు. పుట్టినరోజు వేడుకలను ఏకంగా నాలుగు రోడ్ల జంక్షన్ లో జరుపుకోగా.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో ట్రాఫిక్ లో చిక్కుకుని 2 గంటలకుపైగా నరకం అనుభవించారు సాధారణ ప్రజలు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేటలో చోటుచేసుకుంది. ఈ వేడుకలు చేసింది అధికార పార్టీ వైసీపీ పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమారుడు వికాస్.
వికాస్ పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట చౌరస్తాలో భారీగా వేడుకలు రోడ్డుపై జరుపుకోగా.. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. స్కూలు నుంచి ఇళ్లకు వెళ్లే పిల్లలు, వాహనదారులు, సుదూర ప్రయాణాలు చేయవలసినవాళ్లు ఎమ్మెల్యే కుమారుడు కారణంగా ఇబ్బంది పడ్డారు.
ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అయితే మాత్రం ఇలా ట్రాఫిక్ ను ఆపేస్తారా? అంటూ లేటెస్ట్ గా ఎమ్మెల్యే కొడుకు అతని అనుచరులపై అంబాజిపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188, 290, సెక్షన్ 32 కింద వారిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. పీ గన్నవరం నియోజకవర్గం నుంచి కొండేటి చిట్టిబాబు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున 67వేల 373 ఓట్లతో గెలిచారు.