మహిళలకు స్వాతంత్య్రం రాలేదు.. చట్టంలో లొసుగులు: హోంమంత్రి

  • Published By: vamsi ,Published On : December 16, 2019 / 01:18 AM IST
మహిళలకు స్వాతంత్య్రం రాలేదు.. చట్టంలో లొసుగులు: హోంమంత్రి

Updated On : December 16, 2019 / 1:18 AM IST

దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు దాటినా కూడా దేశంలో మహిళలకు మాత్రం స్వాతంత్రం రాలేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు పాఠశాలలో దిశ చట్టంపై విద్యార్థులు నిర్వహించిన అభినందన సభలో మాట్లాడిన ఆమె.. దేశంలో మహిళల కోసం పటిష్టమైన చట్టాలు లేకపోవడం వల్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. 

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా 30 లక్షల నేరాలు నమోదు అవుతుంటే రాష్ట్రంలో లక్షా 50వేల నేరాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. అందులో ప్రతీ ఏటా మన రాష్ట్రంలో 15 వేల కేసులు మహిళలకు సంబంధించి నమోదు అవుతున్నాయని, ఈ విషయం ఎంతో ఆందోళన కలిగిస్తుందని ఆమె వెల్లడించారు. మహిళలపై అకృత్యాలు జరిగే దేశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్భయ ఘటనతో కేంద్రంలో చట్టం చేసినప్పటికీ అందులో లొసుగుల కారణంగా నేరస్థులను జైలులో పెట్టి మేపుతున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణకే దిశ చట్టం తెచ్చామని ఆమె అన్నారు. ప్రతి పాఠశాలలో మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. మహిళలకు ఆపద వస్తే 100, 1012, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.