హుజూర్ నగర్ ఉప ఎన్నిక : మంత్రి కేటీఆర్ వ్యూహాలు

హుజూర్‌నగర్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఒక దఫా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన కేటీఆర్… ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ ప్రధాన కార్యదర్శికి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పల్లాతో పాటు మరో 31 మంది నాయకులకు కూడా మండలాల వారీగా బాధ్యతలు కేటాయించారు.
హుజూర్‌నగర్‌లో ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన నేతలంతా… హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి వ్యూహాలు రచించారు. నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించి… ఇటీవలే నిర్వహించిన సర్వే వివరాలను కేటీఆర్‌కు అందించారు. ఈ సర్వే ప్రకారం అధికార పార్టీకి 55 శాతానికి పైగా ఓట్లు సాధించే అవకాశముందని తెలిపారు. నియోజకవర్గంలో సర్వేతో ఖుషీగా ఉన్న గులాబీ నేతలు… క్షేత్రస్థాయిలో జనానికి చేరువయ్యేందుకు ప్లాన్ రచించారు.
బూత్ కమిటీలతో సమన్వయం చేస్తూ ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే విధంగా ప్రణాళికలను అమలు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రచార పర్వం ఉపందుకునే లోపే ఒక దఫా ప్రతి గడపకూ టీఆర్ఎస్ చేరే విధంగా ఫోకస్ చేయాలని సూచించారు. మరోవైపు నియోజకవర్గంలో పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొంటారని… ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని గులాబీ నేతలు చెప్తున్నారు. మరో రెండు మూడ్రోజుల్లో ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తామన్నారు.
ఇదిలా ఉంటే…హుజూర్ నగర్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసని, టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న ఆయన..బీజేపీ థర్డ్ ప్లేస్ అంటూ తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి నియోజకవర్గంలో సానుభూతి ఉందని..మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి కేటీఆర్.