TSRTC సమ్మె : అధికంగా వసూలు చేస్తే రూ. 50 వేల ఫైన్ – పేర్ని నాని

  • Published By: madhu ,Published On : October 6, 2019 / 12:16 PM IST
TSRTC సమ్మె : అధికంగా వసూలు చేస్తే రూ. 50 వేల ఫైన్ – పేర్ని నాని

Updated On : October 6, 2019 / 12:16 PM IST

ఏపీలో ప్రైవేటు వాహన యజమానులకు మంత్రి పేర్ని నాని హెచ్చరకలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు అధిక ధరలు వసూలు చేస్తే రూ. 50 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 800 ప్రత్యేక బస్సులు నడిపామన్నారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతన్న సంగతి తెలిసిందే.

దసరా పండుగ ఉన్న సమయంలో సమ్మె చేస్తుండడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్టాల్లోకి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అమాంతం ధరలు పెంచడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2019, అక్టోబర్ 06వ తేదీ ఆదివారం పండుగ రద్దీపై ఏపీ మంత్రి పేర్ని నాని సమీక్ష జరిపారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడుపుతున్నామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మంత్రి పేర్ని నాని. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పండుగ అనంతరం ఇతర అంశాలపై సమీక్ష చేస్తామన్నారు. ఇదిలా ఉంటే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణీకుల దగ్గర ప్రైవేటు వాహన యజమానులు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
Read More : ఏం చర్చించారో చెప్పాలి : మోడీతో జగన్ భేటీపై టీడీపీ విమర్శలు