ఎలక్షన్ ఎఫెక్ట్: అవును.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు

  • Published By: vamsi ,Published On : May 4, 2019 / 02:11 AM IST
ఎలక్షన్ ఎఫెక్ట్: అవును.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు

Updated On : May 4, 2019 / 2:11 AM IST

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవనేది తరచూ వినిపించే నానుడి. అయితే అవే ఎన్నికలు కుటుంబాలను విడగొడతాయి. అన్నదమ్ములను శత్రువులుగా చేస్తాయి. భార్యాభర్తలను దూరం చేస్తాయి. ప్రాణ స్నేహితులలు గొడవలు పెట్టుకునేలా చేస్తాయి. కలిసి ఉండేవాళ్లు విడిపోవడం చూస్తుంటాం. కానీ తెలంగాణలో మాత్రం ఎంపీటీసీ ఎన్నికలు భార్యాభర్తలను కలిసేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మోతె గ్రామానికి చెందిన కవిత, లక్ష్మణ్‌‌లకు చాలా ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. అయితే ఐదేళ్ల నుంచి ఈ దంపతులు వేరువేరుగా ఉంటున్నారు. వారి మధ్య కలతలు చోటుచేసుకోవడంతో ఇద్దరూ విడిపోయి విడివిడిగా ఉంటూ ఉన్నారు.

అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మండల పరిషత్‌లకు జరుగుతున్న ఎన్నికల్లో కవితకు ఓ పార్టీ నుంచి చొప్పదండి ఎంపీటీసీ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ క్రమంలో ప్రత్యర్ధుల నుంచి ఇదే విషయమై విమర్శలు వస్తాయనుకున్నారో? లేక భార్యకు అండగా నిలవాలని అనుకున్నాడో తెలియదు కానీ కవితను గెలిపించేందుకు లక్ష్మణ్ ముందుకొచ్చాడు. ప్రచారం మొదలెట్టాడు. తన భార్యకు ఓటు వెయ్యాలంటూ కోరుతున్నారు. దీంతో ఇద్దరు మళ్లీ కలిశారు. ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ కలిసి పాల్గొంటున్నారు. వాళ్లిద్దరూ కలవడంపై స్థానికంగా నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పరిషత్‌ ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయ్యాయి. ప్రత్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో ఈ రెండు స్థానాలు అధికార టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి.
Mptc ticket, Departed married couple, Karimnagar