ఆగిపోయిన ఆపరేషన్ వశిష్ట: బోటు బయటకు తీయడం కష్టమేనా?

రాయల్ వశిష్ట బోటును బయటకు తీయడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది. మూడు రోజులు పాటు చేసిన ప్రయత్నాలు విఫలం అవగా.. నాలుగవ రోజు బోటు బయటకు తీసే ఆపరేషన్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన చోట బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు.
గోదావరిలో నీటి ఉద్ధృతి పెరగడంతో వరద ప్రవాహం కారణంగా మరో ప్రమాదం జరగకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నీటి ఉధృతి తగ్గిన తర్వాతే మళ్లీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. బోటు ప్రమాదం జరిగి 19 రోజులు గడివగా గల్లంతైన 15మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో బోటును బయటకు తీసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే బోటు బయటకు తీయడం కష్టం అయిపోయింది.
అయితే ప్రతికూల వాతావరణం దానికి అడ్డుగా నిలుస్తుంది. బోటు గనుక యాంకర్ కు తగిలితే ప్లాన్ 2 ప్రకారం బోటును బయటకు తీయాలని భావించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుడులు ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో.. అధికారులు బోటు పనులు ఆపేయాలని ఆదేశించారు. గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో.. ఆ ప్రభావం తగ్గిన తర్వాతే బోటు వెలికితీత పనులు ప్రారంభించే అవకాశం ఉంది.