వారణాసి బరిలో ఒకే ఒక్క పసుపు రైతు

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 02:52 AM IST
వారణాసి బరిలో ఒకే ఒక్క పసుపు రైతు

Updated On : May 2, 2019 / 2:52 AM IST

యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానానికి నిజామాబాద్ రైతులు వేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 25 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 24 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఏర్గట్ట మండల కేంద్రానికి చెందిన సున్నం ఇస్తారి నామినేషన్‌ను మాత్రం అనుమతించారు. దీనితో ఒకే ఒక్క పసుపు రైతు బరిలో నిలిచాడు.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని..మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌ను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు నిజామాబాద్ రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సైతం వీరు బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని వీరు నిర్ణయం తీసుకుని వారణాసి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ప్రధాన మంత్రి మోడీ పోటీ చేస్తున్నారు. మోడీపై పోటీ చేయాలని 25 మంది రైతులు నామినేషన్లు వేశారు.

అయితే..24 నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్లను తిరస్కరించడంపై రైతు సంఘం నేతలు తప్పుబడుతున్నారు. అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని  దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేస్తామని వెల్లడిస్తున్నారు. ఈ స్థానానికి 119 మంది నామినేషన్లు వేశారు. 89 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని..అందులో 24 మంది పసుపు రైతుల నామినేషన్లు ఉన్నాయన్నారు. నామినేషన్లను రీ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.