AP Election 2019 : గుంటూరులో 2 చోట్ల రీ పోలింగ్

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 01:09 AM IST
AP Election 2019 : గుంటూరులో 2 చోట్ల రీ పోలింగ్

Updated On : April 13, 2019 / 1:09 AM IST

APలో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈవీఎంలను ధ్వంసం చేశారు. కేవలం రెండు చోట్ల మాత్రమే రీ పోలింగ్‌ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్‌ కేంద్రం, నరసరావుపేటలోని 94వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ ప్రతిపాదనలు పంపారని, వాటిని యథావిధిగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు.

రీపోలింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25లోక్‌సభ స్థానాలకు మే 23న లెక్కింపు  జరగనుంది. ఇందుకోసం మొత్తం 34 ప్రాంతాల్లో 55 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది.  ఒక్కో లెక్కింపు కేంద్రంలో రెండు హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల  లెక్కంపు చేపట్టనున్నారు. మరోవైపు ఓట్లు నిక్షిప్తమైన ఈవీఎం, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లా కలెక్టర్‌, పోలింగ్‌ ఏజెంట్లు, పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీల్‌ వేశారు.