రోడ్డు వేసే వరకు ఓట్లు వేయం : ఓదెలలో ఓటర్ల నిరసన

పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓదెల నుంచి కనగర్తి వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున నగర్ లో స్థానికులు టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. తమను పట్టించుకోనప్పుడు ఓటు ఎందుకు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు వేసేంత వరకు ఓటేయ్యమని ఖరాఖండిగా చెబుతున్నారు.
Also Read : షాకింగ్ రిప్లైతో స్మృతీ ముఖం వాడిపోయింది
తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మే 10వ తేదీ శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటింగ్‌ను ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారితో 10tv ముచ్చటించింది. 30 ఏళ్లుగా రోడ్డు వేయాలని కోరుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలిపారు.
6 కిలో మీటర్ల దూరం ఉన్న రోడ్డు వేయడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటారని వారు ప్రశ్నించారు. రోడ్డు లేకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పాలకులు ఎన్నికల సమయంలో వాగ్ధానాలు చేశారు..న్యాయం మాత్రం చేయలేదని విమర్శంచారు.
చిన్నపాటి వర్షానికే కొన్ని రోజుల పాటు నీరు నిలిచిపోతోందని..దీంతో అష్టకష్టాలు పడుతున్నామన్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి ఉందని..నిత్యావసర వస్తువులు కొనుక్కొలేని దుస్థితి ఉందన్నారు. నాయకులు కేవలం ఓట్ల కోసం మాత్రమే వాగ్ధానాలు చేస్తున్నారని..ఎన్నికలు అయిన అనంతరం తమను పట్టించుకోలేదన్నారు.
అందుకని ఓట్లు వేయకూడదని తామంతా నిర్ణయించుకుని తీర్మానం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
Also Read : మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి