ఏపీలో పిడుగులు: ఏడుగురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అవుతుండగా.. కోత దశలో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి. మరోవైపు పంటలతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. అకాల వర్షాలు, పిడుగులు కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం 10మంది చనిపోయారు.ఏపీలో శనివారం పిడుగుల మోతతో దద్దరిల్లింది. కృష్ణా, పశ్చిమ గోదావరి మినహా అన్నీ జిల్లాల్లోనూ పిడుగులు పడ్డాయి. పిడుగుల పడే అవకాశం ఉందంటూ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి దాకా విపత్తు నిర్వహణ సంస్థ లక్షలాదిగా మెసేజ్‌లు పంపి అప్రమత్తం చేసింది.
అయినా కూడా గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన షేక్ మస్తాన్‌బీ(48), వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గుమ్మా చిర్రయ్య(55), ఈపూరు మండలం అగ్నిగుండాల రైతు సంగటి చినవెంకటేశ్వరరెడ్డి(71), నూజండ్ల మండలం ముతరాసుపాలెం గ్రామానికి చెందిన యువకుడు చిక్కుడు వెంకట కోటయ్య(25) పిడుగుపాటుకు బలయ్యారు. విశాఖ నగరం వేపగుంటలో ఒకరు, ప్రకాశం జిల్లా దర్శిలో ఒకరు, నెల్లూరు జిల్లా పొంగూరులో ఒకరు పిడుగులు పడడంతో చనిపోయారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యారంలో చెట్టు కొమ్మ విరిగిపడి వ్యక్తి మృతి చెందాడు. నెల్లూరు జిల్లా చిలకలమర్రిలో అత్యధికంగా 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.