మహారాష్ట్రలో రోమాలు నిక్కబొడిచేలా : రావాలి జగన్ పాట రీమేక్ చేసిన శివసేన

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు పాటల ఆల్బమ్ లను రూపొందిస్తాయి. ఇదివరకు తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటూ టీడీపీ జనాల్లోకి వదిలిన సాంగ్ చాలా ఫేమస్.. ఆ పాట తర్వాత తెలుగునాట అంత పాపులర్ అయిన సాంగ్ ‘రావాలి జగన్.. కావాలి జగన్..’.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందిన రావాలి జగన్.. కావాలి జగన్ అనే సాంగ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎంత ఊపును ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలకు సంబంధించి ఇప్పటివరకు రూపొందించిన పాటలలో ఇది హైలెట్ గా నిలిచింది.
ఈ పాట ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. ఇంతగా అందరినీ ఆకట్టుకున్న ఈ పాటను ఇదే తరహా మ్యూజిక్, లిరిక్స్ తో వారి రాష్ట్రాల్లో వాడుకునేందుకు సిద్ధం అవతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎన్నికల వేళ లేటెస్ట్ గా ఈ సాంగ్ తరహాలోనే అక్కడి శివసేన పార్టీ ‘ఆవాజ్ కునాచా’ అనే పాటను రూపొందించింది. ఇదే తరహాలో రూపొందించిన ఆ పాట ఇప్పడు అక్కడ కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను వివరిస్తూ పాట రూపకల్పన చేయగా.. ఇప్పుడు శివసేన కూడా తాము చేయబోయే పనుల గురించి వివరిస్తూ ఈ పాటను రూపొందించింది. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం క్రియేట్ చేసింది. ఇంటర్‌నెట్‌లో ఆ పాటను రెండు కోట్ల మందికి పైగా చూశారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చెబుతుంటారు.
ఈ పాట విడుదలైన అనతి కాలంలో విపరీతంగా జనాల్లోకి వెళ్లింది. లక్షలాది మంది ప్రజలు పాటను మెచ్చుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రోమాలు నిక్కబొడిచేలా రావాలి జగన్ పాటను రూపొందించగా.. ఇప్పుడు శివసేన పాట కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.