సీఎస్ నివేదికపై స్పందించని ఈసీ: ఏపీ కేబినేట్ భేటిపై రాని క్లారిటీ

ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కేబినెట్ సమావేశం నిర్వహించుకొనేందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికపై ఇంతవరకు సమాధానం రాలేదు. రేపటి వరకు మాత్రమే సమయం ఉండటంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసీఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సెలవులో ఉన్నారు. దీంతో ఇప్పుడు కేబినెట్ సమావేశం నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు 10వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అజెండాలోని అంశాలను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతి కోసం నివేదిక పంపింది. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి 48 గంటల సమయం ఇవ్వాల్సి వుంటుంది. అదే ప్రకారం 10వ తేదీనే ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఐతే.. ఇవాళ్టికి 48 గంటలు పూర్తయ్యాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు.
మరోవైపు 6వ విడత ఎన్నికలు జరుగుతుండడంతో ఈసీఐ తీరిక లేకుండా ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికను ఇంకా పరిశీలించలేదు. రేపు ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించి తన నిర్ణయాన్ని తెలిపే అవకాశం వుంది. రేపు సాయంత్రంలోగా ఈసీఐ కేబినెట్ మీటింగ్ నిర్వహణపై స్పష్టత ఇవ్వనుంది. ఐతే.. ఈసీఐ నిర్ణయం ఎలా వున్న అధికార యంత్రాంగం మాత్రం కేబినెట్ సమావేశానికి సిద్ధంగా ఉన్నారు.