వినాయకచవితి : ఈ పత్రాలతో పూజిస్తే.. సిరిసంపదలు మీ ఇంట్లోనే

గణేషుడు.. ఆపదలు తొలగించి.. అష్టఐశ్వర్యాలు ఇచ్చే దేవుడు. వినాయకా అంటే సిరిసంపదలు ఇంట్లోకి తీసుకొస్తాడు. దీనికి హంగూఆర్భాటాలు అక్కర్లేదు. జస్ట్.. 21 రకాలు ఆకులతో పూజిస్తే చాలు. ఈ 21 ఆకుల పేర్లేంటీ.. విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
1. మాచీ పత్రం : తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. చేమంతి ఆకుల రూపంలోనే ఉంటాయి.
2. దూర్వా పత్రం : అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక రెండు రకాలుంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనవి. ఔషద గుణాలు దండిగా ఉంటాయి.
3. అపామార్గ పత్రం : తెలుగులో దీన్నే ఉత్తరేణి అంటారు. సంజీవనిగా కూడా పిలుస్తారు. ఉత్తరేణిని సర్వరోగ నివారిణి అంటారు ఆయుర్వేద నిపుణులు. ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్ళు ఉంటాయి.
4. బృహతీ పత్రం: ములక అని కూడా అంటారు. చిన్న ములక, పెద్ద ములక రెండు రకాలున్నాయి. చూడటానికి వంగ ఆకులుగా ఉంటాయి.
5. దుత్తూర పత్రం : ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు. పువ్వులు తెల్లగా ఉంటాయి. ఉమ్మెత్త కాయలనిండా ముళ్లే.
6. తులసీ పత్రం : శివకేశవులకు తులసి అంటే ప్రాణం. ఔషద గుణాలు మొండు. గణేషుడుని తులసి దళాలతో పూజలు చేయటం శుభప్రదం.
7. బిల్వ పత్రం: మారేడు ఆకు. శివునికి ఎంతో ఇష్టం. మారేడు దళాన్ని చూస్తే అచ్చు పరవశివుడి మూడు కళ్లు గుర్తుకు వస్తాయి. శివుడి మూడు కళ్లు.. ఈ మారేడు దళంలో కనిపిస్తాయి.
8. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
9. చూత పత్రం : మామిడి ఆకు. మామిడి తోరణం లేని పూజ ఉండదు. ఎన్నో ఔషదాలు ఈ మామిడి ఆకుల్లో ఉంటాయి. ఇంటికి శుభం కూడా.
10. కరవీర పత్రం : గన్నేరు అంటారు. పూజలో విశిష్ట స్థానం ఉంది. గన్నేరు చెట్టులేని దేవాలయం ఉండదు. పాలు కారే ఈ చెట్టు పువ్వులతో నిండుగా శోభాయమానంగా ఉంటుంది.
11. మరువక పత్రం: వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా సువాసన వెదజల్లుతుండటం వీటి ప్రత్యేకత.
12. శమీ పత్రం : జమ్మిచెట్టు ఆకులనే శమీ అంటారు. దసరా రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
13. విష్ణుక్రాంత పత్రం : నీలం, తెలుపు పువ్వులుండే మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.
14. సింధువార పత్రం : సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా అంటారు.
15. అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం తరాలుగా వస్తున్న సంప్రదాయం.
16. దాడిమీ పత్రం : దాడిమీ అంటే దానిమ్మ అని అర్థం. దానిమ్మ చెట్లు ఆకులు కూడా వినాయకుడి పూజలో ప్రత్యేక స్థానం సంపాదించాయి.
17. జాజి పత్రం : సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి నుంచి సుగంధ తైలం కూడా తీస్తారు.
18. అర్జున పత్రం : మద్ది చెట్టు ఆకులనే అర్జున ఆకులు అంటారు. అచ్చం మర్రి ఆకులుగానే ఉంటాయి. అడవుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది ఇది.
19. దేవదారు పత్రం : దేవతలకు ఇష్టమైన ఆకు ఇది. ఎత్తుగా పెరుగుతుంది. ఈ చెట్లతోనే కొన్ని వస్తువులను కూడా తయారు చేస్తారు.
20. గండలీ పత్రం : దీన్ని లతాదూర్వా అంటారు. భూమిపైన తీగగా పెరుగుతుంది. పొలాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఇది.
21. అర్క పత్రం : జిల్లేడు ఆకులు ఇవి. తెల్లజిల్లేడు ఆకులతో పూజించటం చూస్తూనే ఉన్నాం.
ఈ 21 పత్రాలతో వినాయకుడిని పూజిస్తే సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటికి వస్తాయనేది ప్రతీతి.