AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. 2 రోజులు పిడుగులతో కూడిన వానలు
ఆగ్నేయ, నైరుతి గాలుల ప్రభావంతో రెండు రోజులు పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది.
AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ దిగువనున్న ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలుల ప్రభావంతో రెండు రోజులు పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. రేపు అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
పిడుగులతో కూడిన వానలు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పంట పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు అప్రమత్తంగా ఉండాలంది. బహిరంగ ప్రదేశాల్లో కానీ, చెట్ల కింద కానీ ఉండరాదని చెప్పింది. సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే తలదాచుకోవాలని సూచించింది.
మరోవైపు ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా పోలవరం జిల్లా వీఆర్ పురంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓవైపు తీవ్రమైన ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోతున్నారు.
Also Read: ఏపీలో మరో కొత్త పథకం.. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా అమలు.. వారి వివాహానికి రూ.లక్ష వరకు
