భయం లేదు : పిడుగురాళ్ళలో భూ ప్రకంపనలు

గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు వచ్చాయి. జనవరి 12వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూమి కంపించింది. పండుగ హడావిడి, సంబురాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి వచ్చి చర్చించుకోవటం జరిగింది. ఇళ్లన్నీ పిల్లాపాపలు, బంధుమిత్రులతో సందడిగా ఉన్న సమయంలో భూ ప్రకంపనలు రావటం కలకలం రేపింది.
కేవలం 2 సెకన్లు భూమి కంపించటంపై ఆందోళన వద్దని అధికారులు తెలిపారు. పిడుగురాళ్ల చుట్టూ క్వారీలు, గనులు ఉన్నాయి. నిత్యం తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే భూ పొరల్లో సర్దుబాటు వల్ల భూ ప్రకంపనలు వచ్చాయని.. ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు అధికారులు. పిడుగురాళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే భూ ప్రకంపనలు ప్రమాదకరం కాదని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. వీటి వల్ల ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరుగలేదు.