Hot Summer: తెలంగాణ ప్రజలకు ఆరోగ్య శాఖ అలర్ట్.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని గదుల్లో ఉండాలన్నారు. మధ్యాహ్నం భారీ శ్రమతో కూడిన పనులు చేయొద్దని సూచించారు.
Hot Summer: తెలంగాణలో ఎండలు మరింతగా మండిపోనున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3°C పెరుగుతుందని అంచనా వేశారు అధికారులు. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య సూర్యకాంతిలో బయటకు రావద్దని హెచ్చరించింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ రవీందర్ నాయక్ సూచించారు. బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని గదుల్లో ఉండాలన్నారు. మధ్యాహ్నం భారీ శ్రమతో కూడిన పనులు చేయొద్దని సూచించారు. కాలి నడకన చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదన్నారు. అధిక వేడి సమయంలో వంట చేయకూడదన్నారు. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బనేటెడ్ డ్రింక్స్, ఎక్కువ చెక్కర ఉన్న పానీయాలు అస్సలు తీసుకోకూడదన్నారు. అధిక ప్రోటీన్, ఉప్పు, మసాలా, నూనె ఎక్కువ ఉండే ఆహారం తినకండని చెప్పారు. నీరు బాగా తాగాలని సూచించారు. దాహం లేకపోయినా తరచుగా సరిపడ నీరు తాగాలన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) వాడాలన్నారు.
ఇంట్లో తయారు చేసుకునే పానీయాలు:
* నిమ్మ నీరు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్, ఉప్పు-చక్కర సొల్యూషన్ (ఇంటి ORS: 1 లీటర్ నీళ్లు + 6 టీ స్పూన్ల చక్కర + అర టీ స్పూన్ ఉప్పు కలిపి బాగా కలపండి).
* ప్రయాణం చేసేటప్పుడు నీళ్ల బాటిల్ తీసుకెళ్లండి.
* నీరు ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, కూరగాయలు తినండి (వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఆరెంజ్, ద్రాక్ష, అనాస, కాకరకాయ మొదలైనవి).
* తేలికపాటి, వదులుగా ఉండే కాటన్ బట్టలు (లేత రంగులు) ధరించండి.
* తల కప్పుకోండి (గొడుగు / హ్యాట్ / క్యాప్ / టవల్ లేదా సాంప్రదాయ తల కవర్ ఉపయోగించండి)
* సూర్యకాంతిలో బయటకు వెళ్తే షూస్ లేదా చెప్పులు తప్పక ధరించండి.
* పగటిపూట (ముఖ్యంగా సూర్యకాంతి పడే వైపు) కిటికీలు, కర్టెన్స్ మూసి ఉంచండి. రాత్రి చల్లని గాలి రావడానికి తెరవండి.
* బయటి పనులు ఉదయం, సాయంత్రం చల్లని సమయంలోనే చేయండి.
* వంట చేసే చోట తలుపులు, కిటికీలు తెరిచి గాలి తిరిగేలా చేయండి.
హీట్ వేవ్ డేంజర్ సైన్స్ (ప్రమాద లక్షణాలు)
* వికారం, వాంతులు
* వేడి, ఎర్రటి, పొడి చర్మం
* శరీర ఉష్ణోగ్రత ≥40°C లేదా 104°F
* తలనొప్పి
* ఆందోళన, మైకం, స్పృహ కోల్పోవడం
* కండరాల బలహీనత / తిమ్మిర్లు
* వేగవంతమైన హృదయ స్పందన
* వేగవంతమైన, లోతు లేని శ్వాస
* మానసిక గందరగోళం (గందరగోళం, కోపం, చిరాకు, సీజర్, కోమా)
వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సహాయం తీసుకోండి.
ప్రభుత్వం అన్ని పబ్లిక్ హాస్పిటల్స్ లో స్పెషల్ బెడ్స్, IV ఫ్లూయిడ్స్, మందులు సిద్ధం చేసి ఉంచింది.
ANM / ASHA / అంగన్వాడీ వర్కర్ల వద్ద ORS సాచెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Also Read: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ఊబకాయులు పెరిగిపోతున్నారు.. దేశంలోనే సెకండ్ ప్లేస్..
