ఎవరైనా చేశారా : 3 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 07:59 AM IST
ఎవరైనా చేశారా : 3 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు – సీఎం జగన్

ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోందని..అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం జగన్. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు గ్రామ వాలంటీర్లను నియమించడం జరిగిందన్నారు. వీరికి రూ. 5 వేల వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు..ఇప్పటికే పలు పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

100 రోజుల పాలన సందర్భంగా..2019, సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ పలాసలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడారు. వంద రోజుల పాలనలో జరిగిన పనులను ఆయన సభలో వెల్లడించారు. 

తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి కొబ్బరి చెట్టుకు రూ. 15 వందల నుంచి రూ. 3 వేల వరకు పరిహారం పెంచుతున్నట్లు ప్రకటించారు. వీరందరికీ చెక్కుల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీఠ వేయబోతన్నట్లు, వంశధార నదిపై కడుతున్న బ్రిడ్జి పనులను యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో ప్రాజెక్టుల పనులను పరుగులు తీయిస్తానని హామీనిస్తున్నట్లు సభలో తెలిపారు సీఎం జగన్. ఎన్నికల వేళ ఇచ్చినట్లు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట అమలు చేసి తీరుతానని మరోసారి సీఎం జగన్ హామీనిచ్చారు.