ఏపీలో ఎండలపై హైఅలర్ట్ : ఆ జిల్లాల్లో ప్రజలు బయటకు రావొద్దు

  • Published By: chvmurthy ,Published On : May 4, 2019 / 09:55 AM IST
ఏపీలో ఎండలపై హైఅలర్ట్ : ఆ జిల్లాల్లో ప్రజలు బయటకు రావొద్దు

తుఫాన్ తో వచ్చిన కూల్ వెదర్ అప్పుడే ఆవిరైపోయింది. ఓ రెండు రోజులు చల్ల గాలులతో చల్లబడిన ఏపీ జనం.. ఇప్పుడు బాబోయ్ ఎండలు, మంటలు అంటున్నారు. రాబోయే 3, 4 రోజులు కూడా ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు.. ప్రజల గుండెలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణం కంటే అధికంగా 5 నుంచి 7 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీలు నమోదు అవుతుండగా.. రాబోయే 3, 4 రోజుల్లో ఇది 47 డిగ్రీల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. 

మండే ఎండలు ఉండే జిల్లాలు :
కృష్ణ, గుంటూరు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హెచ్చరికలు ఇచ్చింది వెదర్ రిపోర్ట్. వడగాలులు విపరీతంగా ఉంటాయని.. ఉదయం 10 నుంచే ఎండ మండిపోతుందని కూడా స్పష్టం చేసింది. మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా 46-47 డిగ్రీలకు వెళ్లొచ్చని కూడా వార్నింగ్ ఇచ్చింది. పిల్లలు, పెద్దలు బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరం అయితే ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలని సూచించారు. ఫోని తుఫాను కారణంగా వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిందని, దీంతో ఎండలు ఎక్కువగా నమోదు అవుతాయని వెల్లడించింది. పొడి వాతావరణంతో నీరసం, అలసట కూడా ఉంటుందని.. దాని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా సూచనలు, సలహాలు ఇచ్చింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

2019, మే 3వ తేదీ శుక్రవారం ఏపీలోని చాలా చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. నెల్లూరు, కావలి, గుంటూరు, బాపట్ల , మచిలీపట్నంలో కనీస ఉష్ణోగ్రతల కంటే 7 డిగ్రీలు అధనంగా ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంది. కాకినాడ, ఒంగోలులో సాధారణంకంటే 3-5 డిగ్రీల టెంపరేచర్ అధికంగా ఉంది.