భారత్ ను రక్షిస్తాయా ? మోడీ చెప్పిన 5 పిల్లర్లేంటీ

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 03:39 AM IST
భారత్ ను రక్షిస్తాయా ? మోడీ చెప్పిన 5 పిల్లర్లేంటీ

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న భారత్‌ను నిలబెట్టేవి ఏంటి? ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి? భారత్‌ను ఏవి నిలబెడతాయని ప్రధాని మోదీ చెప్పారు? మోదీ ప్రకటించిన ఐదు పిల్లర్లు భారత్‌ను రక్షిస్తాయా? 4 వ దఫా పొడిగించనున్న లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు కూడా మారబోతున్నాయి.

కొత్త నిబంధనలు కూడా పెట్టనున్నట్టు మోదీ ప్రకటించారు. అంతేకాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు కూడా తీసుకోనున్నట్టు ప్రధాని తెలిపారు.  కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం నుంచి తేరుకొని.. పురోగమించడానికి గల వ్యూహాలకు పదును పెట్టనున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమించేలా 20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ కూడా ప్రకటించారు. ఇక రానున్న రోజుల్లో ఐదు పిల్లర్లే భారత్‌ను నిలబెడతాయని కూడా ప్రధాని సెలవిచ్చారు

మొదటి పిల్లర్‌ ఎకానమీ :-
భారత ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారితో అనేక కుదుపులకులోనయ్యింది. ఇకపై ఇండియా ఎకానమీ ఎలాంటి కుదుపులకులోను కాకుండా ఒక క్రమపద్ధతిలో పురోగమించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మోదీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. చిన్న చిన్నగా ఆర్థిక వ్యవస్థను మార్చడం కాదని.. ఒకేసారి పెద్ద జంప్‌ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రెండవ పిల్లర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ :-
భారత స్వయం సమృద్ధిలో రెండవ పిల్లర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉంటుందని మోదీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన మౌలికవసతులు భారత్‌ సొంతం. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆధునిక ఇండియాకు గుర్తింపుగా నిలిచే ఈ మౌళిక సదుపాయాలను మనం ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

మూడో పిల్లర్ దేశ సామాజిక వ్యవస్థ :-
దేశ సామాజిక వ్యవస్థను మూడో పిల్లర్‌గా మోదీ ప్రకటించారు. ఇది గత శతాబ్దపు సూత్రాలను పాటించలేదన్నారు. 21వ శతాబ్దపు స్వప్నాలను నిజం చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. దీంతో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మోదీ తెలిపారు.

నాలుగో పిల్లర్ పిల్లర్ ప్రజాస్వామ్యం :-
ఇక ఉజ్వలమైన ప్రజాస్వామ్యమే దేశ నాలుగో స్తంభమని మోదీ తెలిపారు. దేశ ప్రజాస్వామ్యమే మనకు బలమన్నారు. భారత్‌ను స్వయం సమృద్ధి చేయాలంటే ఇదే మనకు చోదకశక్తిగా పనిచేస్తుందన్నారు. 

ఐదవ పిల్లర్ సప్లయ్‌ అండ్‌ డిమాండ్‌ :-
ఇక కీలకమైన ఐదవ పిల్లర్‌ సప్లయ్‌ అండ్‌ డిమాండ్‌ అని మోదీ తెలిపారు. సప్లయ్‌, డిమాండ్‌ అనేవి మన శక్తి అని.. దాన్ని పూర్తి సామర్థ్యంతో వాడుకోవాలని ప్రధాని సూచించారు.

భారత్‌ ఎప్పుడు కూడా ఆపదను అవసరంగా మార్చుకుంటుందని… కరోనాతో అది మరోసారి ప్రపంచానికి నిరూపించి చూపించామన్నారు.  ఈ సంక్షోభ సమయంలో మరింత సమర్థవంతగా పనిచేయాలని.. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తాను చెప్పిన ఐదు మూలస్తంభాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

Read More :

*  20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ

లాక్‌డౌన్ 4: మే 18 నుంచి.. కొత్తగా అమలు