Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?

పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది.

Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?

who will in Jagtial Assembly constituency

Jagtial Politics: ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే జగిత్యాలలో ఈ సారి హోరాహోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. అధికార పార్టీ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ ఒక్కటే.. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్కు జగిత్యాల జనం వన్స్ మోర్ అంటారా? ఎప్పటికప్పుడు లాస్ట్ చాన్స్ అనే జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా? ఈసారి జగిత్యాలలో కనిపించబోయే సీనేంటి?

జగిత్యాల నియెజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడి పుట్టిస్తోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రచార రంగంలోకి దిగిపోయాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మరోసారి పోటీచేయనుండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పోటీకి రెడీ అయిపోయారు. జగిత్యాల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్‌రెడ్డికి గత ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. 2018 ఎన్నికలే తనకు చివరివంటూ ప్రచారం చేసినా జగిత్యాల జనం జైకొట్టలేదు. ఏకంగా 60 వేల ఓట్ల మెజార్టీతో గులాబీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ గెలుపొందారు. ఇక రానున్న ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు పాతకాపులతో పాటు.. బీజేపీ కూడా బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. ఇక్కడ త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

బీసీ ఓటర్లు అధికంగా ఉన్న జగిత్యాల సెగ్మెంట్లో దాదాపు 2 లక్షల 14 వేల ఓట్లు ఉన్నాయి. పద్మశాలి, మున్నురు కాపు, ముస్లిం ఓటర్లు ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. 2014లో కాంగ్రెస్‌ను ఆదరించిన మైనార్టీలు.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై మొగ్గు చూపడంతో ఘన విజయం సాధించింది గులాబీ పార్టీ… అందుకే ఈ సారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీ ఓట్లపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇక ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు కీలకమే.. ఆ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎల్.రమణ కారెక్కేయడం.. ఆయనను ఎమ్మెల్సీ చేయడంతో చేనేత ఓట్లపై బీఆర్ఎస్ భారీ ఆశలే పెట్టుకుంది. మరోవైపు బీజేపీ సైతం ఆ వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ శ్రావణికి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇక కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తొలిసారిగా గెలిచింది అధికార బీఆర్ఎస్. గత ఎన్నికల వరకు ఇక్కడ సీనియర్ నేతలైన జీవన్‌రెడ్డి, ఎల్.రమణ మధ్యే పోటీ జరిగేది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభావం తగ్గిపోవడంతో.. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన రమణ అధికార బీఆర్ఎస్‌లో చేరిపోయారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రమణ సీనియార్టీని గుర్తించిన గులాబీ బాస్ కేసీఆర్.. రమణను ఎమ్మెల్సీ సైతం చేశారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు జీవన్‌రెడ్డి.. ఇలా ఈ నియోజకవర్గం నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వచ్చే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

గత ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. రెండోసారి గెలుపుపై పూర్తి ధీమగా ఉన్నారు. టికెట్ ప్రకటన చేయకముందు నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేగా పల్లెబాట పట్టారు సంజయ్‌కుమార్. పల్లెల్లో రాత్రిబస చేస్తూ గ్రామస్థులతో మమేకమవుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్‌పై ప్రజావ్యతిరేకతను గుర్తించి రద్దు చేయించడం ద్వారా ఆ పరిధిలోని ఓటర్లలో కొంత సానుకూలత ఏర్పరుచుకున్నారు. గత ఐదేళ్లుగా తాను చేసిన అభివృద్ధిపైనే ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు డాక్టర్ సంజయ్‌కుమార్.

Also Read: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

ఇక గత ఎన్నికల్లో లాస్ట్ చాన్స్ ఇవ్వాలంటూ ప్రచారం చేసిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. అప్పుడు ఓడిపోవడంతో మరో అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను కోరుతున్నారు. ఈసారి గెలిచి తన రాజకీయ ఇన్నింగ్స్ ను ముగిస్తానంటూ సెంటిమెంట్ బాణాలను సంధిస్తున్నారు. గత ఎన్నికల్లో పనిచేయని లాస్ట్ ఛాన్స్ సెంటిమెంట్ ఈ సారైనా కలిసిరాకపోతుందా అనే వ్యూహంలో ఉన్నారు జీవన్ రెడ్డి.

Also Read: వారి ఉజ్వల భవిష్యత్తుకోసం ఎంతవరకైనా వెళ్తాం.. అరవింద్ ట్వీట్ కు ప్రధాని మోదీ రియాక్షన్

ఇక పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ముదుగంటి రవీందర్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డిలాంటి వాళ్లు టికెట్ ఆశిస్తున్నా.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ శ్రావణికే అధిష్టానం ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన శ్రావణి మాత్రమే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు దీటుగా పోటీ ఇవ్వగలరని నమ్ముతోంది కమలదళం.

మొత్తానికి జగిత్యాల బరిలో మూడు పార్టీలూ తగ్గేదేలే అంటూ తలపడుతున్నాయి. అధికార బలం.. అభివృద్ధి నినాదంతో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తానని బీఆర్ఎస్ ధీమాగా ఉంటే.. కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి లాస్ట్ చాన్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. ఇక బీజేపీ కూడా పోరుకు సై అంటుండటంతో ఉద్యమాల గడ్డ జగిత్యాలలో త్రిముఖపోరు తప్పేలా లేదు. ఈ పోటీలో ఎవరు గట్టెక్కుతారనేదే ఉత్కంఠ రేపుతోంది.