Lok Sabha Elections 2024: మోదీ, రాహుల్.. ఎన్డీయే, ఇండియా.. ఎవరి సత్తా ఎంతో తెలుసా?

ఇది కూడా మోదీ, అమిత్‌షా ధ్వయం స్ట్రాటజీలో భాగమని భావిస్తున్నారు.

Lok Sabha Elections 2024: మోదీ, రాహుల్.. ఎన్డీయే, ఇండియా.. ఎవరి సత్తా ఎంతో తెలుసా?

NDA VS INDIA

దేశంలో పార్లమెంట్‌ ఎన్నికల వేడి మరింత పెరిగింది. మరి ఈసారి ఎన్డీయే , I.N.D.I.A కూటమి మధ్య ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయా..? మూడోసారి మోదీనే అనే నినాదం పనిచేస్తుందా..? మళ్లీ కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కాంగ్రెస్‌ ఆశలు ఫలిస్తాయా..? ఎవరి బలాలెంత..? ప్రాంతీయ పార్టీల హవా ఎంత..?

ఇలా దేశరాజకీయాలపై పలు విశ్లేషణలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలంటేనే.. ఎత్తులు, పైఎత్తులు, పోల్‌ మేనేజ్‌మెంట్‌.. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్‌ కచ్చితంగా ప్రభావం చూపుతుంటాయి. మరి ఎన్డీయే కూటమి బలమెంత..? I.N.D.I.A కూటమి సత్తా ఎంత..?

యుద్ధం ఎంత ముఖ్యమో.. దానికి తగిన వ్యూహం కూడా అంతే ముఖ్యం. యుద్ధానికి కీలకమైన ఆయుధం వ్యూహమే . అందుకే సార్వత్రిక ఎన్నికలనగానే ప్రతి పార్టీ కూడా యుద్ధభేరిలో గెలవాలని ఉవ్విళ్లూరుతుంది. దానికి తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. అయితే గెలుపోటములు మాత్రం అద్భుతమైన వ్యూహాలను అమలుచేసే పార్టీనే వరిస్తుంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలను గమనిస్తే.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండుసార్లు అధికారపీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు మోదీ మూడోసారి నినాదంతో ఎన్డీయే కూటమి సమరానికి సిద్ధమంటోంది.

యాంటీ మోదీ నినాదంతో..
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు.. ముఖ్యంగా యాంటీ మోదీ నినాదం , ఎన్డీయేతర పక్షాలను కూడగట్టి కాంగ్రెస్‌.. I.N.D.I.A కూటమిపేరుతో విపక్ష అలయెన్స్‌ను ఏర్పాటు చేయగలిగింది. అయితే I.N.D.I.A కూటమి నుంచి నితీశ్‌ కుమార్‌ జేడీయూ పార్టీ బయటకు రావడం, తిరిగి ఎన్డీయే కూటమితో దోస్తీ కట్టడం సహా ఈమధ్య చోటు చేసుకున్న పరిణామాలు మరోసారి దేశ రాజకీయాలపై పలురకాల ఆసక్తికర విశ్లేషణలు, అంచనాలను తెరపైకి వస్తున్నాయి.

పదేళ్ల తర్వాత I.N.D.I.A కూటమి పేరుతో కాంగ్రెస్‌ మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఎన్డీయే కూటమి గండికొట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి రకరకాల కారణాలనూ చూపుతున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్‌ చేస్తున్న తప్పిదాలే ఇందుకు కారణమంటున్నారు. ఎన్నికల సమరశంఖం పూరించి యుద్ధానికి సిద్ధమయ్యే వ్యూహ రచనలో కాంగ్రెస్‌ వెనకబడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ ఎలక్షన్‌ ప్లాన్స్‌లో ఉంటే.. రాహుల్‌ మాత్రం భారత్ న్యాయ యాత్రలో బిజీగా ఉన్నారు.

దీంతో ఏఐసీసీ హెడ్‌ క్వార్టర్స్‌ ఖాళీగా కనబడుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నా.. వెనక ఉండి కాంగ్రెస్‌ను నడిపించేది, నిర్ణయాలు తీసుకునేది సోనియా, రాహుల్‌ గాంధీనే అన్నది అందరికీ తెలిసిందే. అయితే.. ఎన్నికలకు రెండుమూడు నెలలే ఉన్నా.. రాహుల్‌ ఇంకా ఎలక్షన్‌ స్ట్రాటజీలు, అభ్యర్థుల ఎంపిక అని ఏఐసీసీ కార్యాలయంలో కూర్చుని ఫుల్‌ బిజీగా లెక్కలు వేయకుండా.. న్యాయ్‌ యాత్ర అంటూ తాపీగా ఫీల్డ్‌వర్క్‌ చేస్తుండటంతో.. పార్టీ క్యాడర్‌లో కన్‌ఫ్యూజన్‌తో పాటు బీపీ కూడా పెరుగుతోంది.

నిజానికి ఎన్డీయేతో ఢీకొట్టాలని I.N.D.I.A కూటమి అనుకున్నప్పుడు అందులో కాంగ్రెస్‌ది కీలక పాత్ర.. కానీ.. రాహుల్‌ అస్త్రసన్యాసం చేసినట్లు ఇలా రాష్ట్రాల్లో తిరగడమేంటని అంటున్నారు. వాస్తవానికి I.N.D.I.A కూటమిని మరింత బలోపేతం చేసేదిశగా రాహుల్‌ , ఇతర కాంగ్రెస్‌ సీనియర్లు శ్రద్ధపెట్టివుంటే.. బీహార్‌ సీఎం నితీశ్‌లాంటి వారు అలయన్స్‌నుంచి అసలు బయటకు వచ్చేవారు కాదు.

కూటమిలో అసంతృప్తులతో చర్చించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడంలో కాంగ్రెస్‌ తడబడింది. ఇదే అదునుగా బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. నితీశ్‌ను వలలో వేసుకోవడంతో I.N.D.I.A కూటమిని సైకలాజికల్‌గా ఎన్డీయే దెబ్బతీసిందని అంటున్నారు. ఈ ఒక్క పరిణామంతో I.N.D.I.A కూటమిపై సవాలక్ష డౌట్స్‌ క్రియేట్‌ అయ్యాయి.

కూటమి అంటేనే పార్టీల ఐక్యత, ఏకతాటిపై నిర్ణయాలు తీసుకుని వెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. కానీ.. నితీశ్ తర్వాత మమత, స్టాలిన్‌ , శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌ , అఖిలేశ్‌ యాదవ్‌ , కేజ్రీవాల్‌, లెఫ్ట్‌ పార్టీలు ఇండియా కూటమిలో చాలామంది కీలక నేతలే ఉన్నారు. అయితే నితీశ్‌ ఎన్డీయేలోకి జంప్‌ కావడంతో మిగతా పార్టీల వైపు అనుమానంగా చూసే పరిస్థితులు తలెత్తాయి. ఇది ఎన్డీయే సైకలాజిక్‌ గేమ్‌లో విన్నింగ్‌ ఫ్యాక్టర్‌ అనే అభిప్రాయాలున్నాయి.

సమన్వయ లోపమే కారణం?

నితీశ్ I.N.D.I.A కూటమినుంచి వైదొలగడం మంచిదేనని కాంగ్రెస్‌ అలయన్స్‌ పార్టీలంటున్నా.. గ్రౌండ్‌లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కూటమిలో సమన్వయ లోపమే దీనికి కారణమంటున్నారు. ఇది ఇలాగే సాగితే.. ఎన్నికల సమయానికి ఇంకెన్ని పార్టీలు ఫిరాయిస్తాయోననే డౌట్స్‌ వస్తున్నాయి. బలమైన కూటమి అని ఎలివేట్‌ చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమవ్వడానికి ఓవైపు సోనియా, ఖర్గే కారణమైతే.. మరోవైపు రాహుల్‌ గాంధీదే బాధ్యత అంటున్నారు.

సేనాధిపతిలా యుద్ధక్షేత్రానికి అవసరమైన వ్యూహాలు వేయకుండా.. మణిపుర్‌, నాగాలాండ్‌, అసోం అంటూ రాహుల్‌ పాదయాత్రలో మునిగి తేలుతున్నారు. ఆఖరికి బీహార్‌ చేరే సరికి I.N.D.I.A కూటమికి బీటలు వారాయి. ఇది కూడా మోదీ , అమిత్‌షా ధ్వయం స్ట్రాటజీలో భాగమని భావిస్తున్నారు. బీహార్‌ సీఎం నితీశ్‌ను తమవైపు తిప్పుకోవడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ను ఎన్డీయే కూటమి పొందిందనేది విశ్లేషకులు చెబుతున్నమాట.

TDP : సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ స్పెష‌ల్ ఫోక‌స్‌.. అభ్య‌ర్థుల ఖ‌రారుపై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు