టార్గెట్ యాదవులు.. అన్ని పార్టీల గురి వారి ఓట్లపైనే, ఏపీలో సరికొత్త రాజకీయం

గతంలో ఎప్పుడూ లేనట్లు రెండు ప్రధాన పార్టీలూ ఈసారి యాదవ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తుండటం ఆసక్తి రేపుతోంది.

టార్గెట్ యాదవులు.. అన్ని పార్టీల గురి వారి ఓట్లపైనే, ఏపీలో సరికొత్త రాజకీయం

Caste Politics In AP

Yadava Community Politics : కులాల ప్రస్తావన లేకుండా ఏపీ రాజకీయాలను ఊహించలేం. ప్రస్తుతం రెండు, మూడు పార్టీలు బలంగా ఉన్నట్లు కనిపించడానికి కారణం, ఆయా పార్టీల వెనుక ఏదో ఒక కులం వెన్నుదన్నుగా నిలవడమే. ఇక రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బీసీలు కూడా రాజకీయాలను శాసిస్తుంటారు. బీసీల్లో చెప్పుకోదగ్గ నేతల సంఖ్య తక్కువగా ఉన్నా, వారి ఓట్ల కోసం పార్టీలు వేస్తున్న స్కెచ్‌లు దిమ్మదిరిగేలా ఉంటున్నాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఏపీ ఎన్నికల్లో బీసీల ఓట్లపై గురిపెట్టిన పార్టీలు.. బీసీల్లో ఎక్కువగా ప్రభావం చూపే కులాలపై మరింత ఫోకస్‌ పెట్టాయి. ఆయా వర్గాలకు చెందిన నేతలకు ఎక్కువ సీట్లు ఇస్తూ.. ఓట్ల వేట మొదలుపెట్టాయి.

యాదవ సామాజికవర్గానికి పెద్ద పీట..
ఏపీ రాజకీయాల్లో కులాల వారీగా ఓట్ల వేటను ఆరంభించాయి పార్టీలు. ముఖ్యంగా మార్పులు చేర్పుల ద్వారా వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం వెనుక సామాజికవర్గాల వారీగా బలం పెంచుకునే ఎత్తుగడ ఉందని చెబుతున్నారు పరిశీలకులు. దీనికి అనుగుణంగానే ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి కూడా పావులు కదుపుతుండటంతో ఎన్నికల ముందు బీసీలు, బీసీల్లో ఎక్కువ జనాభా ఉన్న సామాజికవర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా యాదవ సామాజికవర్గానికి ఇరుపార్టీలు ఇస్తున్న ప్రాధాన్యత పరిశీలిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గ నేతలు కీలక పాత్ర పోషించే పరిస్థితిని సూచిస్తోంది.

అనూహ్యంగా బీసీలపై వైసీపీ ఫోకస్‌..
ప్రధానంగా ఇన్నాళ్లు ఓ సామాజికవర్గానికి పెద్దపీట వేసినట్లు విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బీసీలపై ఫోకస్‌ పెట్టింది. అందులోనూ యాదవ సామాజికవర్గం ఓట్ల కోసం పక్కాగా ప్లాన్‌ చేస్తోంది. మార్పులు చేర్పుల్లో ఒక చోట నుంచి ఇంకోచోటకు అభ్యర్థులను తరలిస్తున్న వైసీపీ.. ఆ తరలింపు వెనుక ఆ నేత సామాజిక నేపథ్యం చూసుకుని.. ఆ కులం వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు బదిలీ చేయడం చూస్తే, చాపకింద నీరులా పకడ్బందీగా తన వ్యూహాలను అమలు చేస్తున్నట్లే అర్థమవుతోంది.

అనిల్ కుమార్ యాదవ్ మార్పు వెనుక భారీ వ్యూహం..
వైసీపీ స్థాన చలనాల లిస్టులో సంచలనం రేపిన నేత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్‌ యాదవ్‌ మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తుండగా, ఎవరూ ఊహించని విధంగా ఆయనకు రెండు జిల్లాలు దాటించి పల్నాడు జిల్లా నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ అధిష్టానం. ఈ మార్పు చాలా మందికి ముందుగా అర్థం కాలేదు. అక్కడి వారు ఇక్కడికొస్తే ఏం ప్రయోజనం అంటూ పార్టీలోనూ నిట్టూర్పులు వినిపించాయి.

Also Read : ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌.. రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం!

కానీ, నరసారావుపేట నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్లు యాదవ సామాజికవర్గానివే ఉండటంతోనే అనిల్‌ను అక్కడికి పంపారంటున్నారు. ఒక కులానికి చెందిన ఓట్లు గంపగుత్తుగా పొందే వ్యూహంలో భాగంగానే ఇటువంటి మార్పులు చేస్తోంది వైసీపీ. ఇలా అనిల్‌కుమార్ యాదవ్‌ ఒక్కరే కాకుండా.. ఆ పార్టీలో చాలామంది యాదవ సామాజిక వర్గ నేతలకు టికెట్లు ఇచ్చింది.

అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అదిరిపోయే వ్యూహం..
ముఖ్యంగా విశాఖ నగరంలోని చేసిన మార్పు కూడా వైసీపీ ఎంత పక్కాగా స్కెచ్‌ వేస్తోందో తెలియజేస్తోంది. నగరంలోని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని పక్కన పెట్టింది వైసీపీ. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాగిరెడ్డిని తప్పిస్తారని ఎవరూ ఊహించలేదు. గత ఎన్నికల్లో జనసేనాని పవన్‌ను ఓడించిన నాగిరెడ్డికి మళ్లీ టికెట్‌ ఖాయం అనుకున్నారు. కానీ, ఇక్కడ కూడా బీసీ అస్త్రం సంధించింది వైసీపీ. ఈ నియోజకవర్గంలో సుమారు 50 వేల యాదవుల ఓట్లు ఉన్నట్లు గమనించి, ఆ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావుకు టికెట్‌ కన్ఫార్మ్‌ చేసింది. వైసీపీ తొలి జాబితాలోనే చేసిన ఈ మార్పును ముందుగా ఎవరూ అర్థం చేసుకోలేదు. కానీ, వైసీపీ విడుదల చేసిన ఆరు జాబితాలను జాగ్రత్తగా గమనిస్తే బీసీలు, బీసీల్లో బలమైన కులాల ఓట్లకు గాలం వేస్తూ ఎంత పకడ్బందీగా పావులు కదుపుతుందో అర్థం చేసుకోవచ్చు.

అందుకే.. సునీల్ కు ఏలూరు ఎంపీ టికెట్..!
ఇదే విధంగా గోదావరి జిల్లాలో కాపు ఓట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో కాపులు వెన్నుదన్నుగా నిలవడంతో బంపర్‌ మెజార్టీతో గెలుపొందింది వైసీపీ. ఐతే ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావంతో కాపుల ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలతో అప్రమత్తమైన వైసీపీ హైకమాండ్‌ ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీలను ఏకీకృతం చేసే స్కెచ్‌కు పదును పెట్టింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజలను ప్రోత్సహిస్తుండగా, పశ్చిమ గోదావరిలో యాదవుల ఓట్లపై దృష్టి పెట్టి, ఏలూరు ఎంపీ టికెట్‌ను ఆ సామాజికవర్గానికి చెందిన కారుమూరి సునీల్‌కుమార్‌కు కేటాయించింది. సునీల్‌కుమార్‌ తండ్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఈయన మరోసారి తణుకు నుంచి పోటీ చేయనున్నారు.

వసంతను పక్కన పెట్టడానికి కారణమదే..!
ఇప్పటివరకు ఏలూరు పార్లమెంట్‌లో అగ్రవర్ణాల వారే ఎంపీలుగా ఎన్నికవగా, తొలిసారి బీసీలకు అవకాశమిచ్చిన పార్టీగా ఆయా వర్గాల ఓట్లను కొట్టేయాలని ప్లాన్‌ చేసింది వైసీపీ.. ఇదేవిధంగా కృష్ణా జిల్లా మైలవరంలో కూడా అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను తప్పించి, యాదవ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. ఈ కోవలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి అసెంబ్లీ ఇన్‌చార్జిగా దుద్దాల నారాయణ యాదవ్‌ను నియమించింది వైసీపీ. ఆ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లు బీసీల్లోని ఓ సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వ్యూహత్మక ఎత్తుగడగా చెబుతున్నారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ? పొత్తుతో కలిగే లాభాలు ఏంటి, ఎదురయ్యే సవాళ్లు ఏంటి..

యాదవులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేలా టీడీపీ-జనసేన కూటమి జాగ్రత్త..
బీసీల ఓట్లకు గురిపెట్టిన అధికార వైసీపీకి తగ్గట్లే టీడీపీ కూడా అంతకుమించిన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆవిర్భావం నుంచి బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో బీసీల్లో యాదవులకు ప్రాతినిధ్యం ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు.. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా యాదవులు ప్రాబల్యం ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసి, ఆ వర్గానికే టికెట్‌ కేటాయించేలా ప్రణాళిక రచిస్తోంది టీడీపీ-జనసేన కూటమి.

బీసీ ఓట్ల టీడీపీ గాలం..
గత ఎన్నికల్లో జనసేనాని పవన్‌ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ యాదవ సామాజికవర్గానికి చెందిన నేత వరికూటి రామచంద్రరావుకు అవకాశం ఇవ్వడంతో టీడీపీ తరఫున బలమైన యాదవ సామాజికవర్గ నేతనే బరిలోకి దింపుతోంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మళ్లీ అవకాశం ఇవ్వడం ద్వారా బీసీ ఓట్లకు గాలం వేస్తోంది టీడీపీ. ఇదేవిధంగా ఎమ్మెల్సీ మురళీకృష్ణ యాదవ్‌ను విశాఖ సౌత్‌ నుంచి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. విశాఖ నగరంలో యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉండటం వల్ల కూటమి ఆ సామాజివర్గానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

యనమల కుమార్తె దివ్య, అల్లుడికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు..!
ఇక టీడీపీలో బలమైన యాదవ సామాజికవర్గనేత యనమల రామకృష్ణుడు కుటుంబానికి ప్రాధాన్యం పెంచుతోంది టీడీపీ. ఇప్పటికే పార్టీలో ముఖ్యనేతగా చలామణీ అవుతున్న రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టికెట్‌ ఇవ్వనుండగా, ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు కడప జిల్లా మైదకూరు టికెట్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. యనమల అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ను ఒంగోలు ఎంపీగా బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పుట్టా మహేశ్‌కుమార్‌ను యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నరసారావుపేట ఎంపీగా పోటీకి పెట్టాలని భావించింది టీడీపీ. అయితే, అక్కడ సిట్టింగ్‌ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో చేరడంతో తన వ్యూహాన్ని మార్చింది టీడీపీ.

నూజివీడు బరిలో యాదవ నేత పార్ధసారథి.. జంగా కృష్ణమూర్తితో టీడీపీ చర్చలు
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథిని పార్టీలో చేర్చుకుని యాదవులు ఎక్కువగా ఉన్న నూజివీడు బరిలో దింపాలని ప్లాన్‌ చేస్తోంది. అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన యాదవ సామాజిక వర్గ నేత జంగా కృష్ణమూర్తితోనూ టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. తమ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నుంచి శంకర్‌యాదవ్‌ను, ప్రకాశం జిల్లా చీరాల నుంచి కొండయ్య యాదవ్‌ పేర్లను పరిశీలిస్తోంది టీడీపీ. అదే విధంగా ఏలూరులో అధికార పార్టీ వ్యూహానికి చెక్‌చెబుతూ అదే సామాజికవర్గానికి చెందిన గోపాల యాదవ్‌ను బరిలోకి దింపనుందని చెబుతున్నారు.

యాదవ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు..
గతంలో ఎప్పుడూ లేనట్లు రెండు ప్రధాన పార్టీలూ ఈసారి యాదవ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే వ్యూహాలు రచిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకు ఆరు జాబితాల్లో 60కి పైగా కొత్త సమన్వయకర్తలను నియమించిన వైసీపీ యాదవులకు సముచిత స్థానం కల్పించగా, ఇక ప్రకటించబోయే నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్న టీడీపీ ఇంతవరకు అధికారికంగా టికెట్లు ప్రకటించకపోయినా, వైసీపీకి తగ్గట్టే యాదవులకు సీట్లు ఎక్కువ ఇచ్చేలా పావులు కదుపుతుండటం ఆసక్తిరేపుతోంది.