Lasya Nanditha : కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది.

Lasya Nanditha : కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

Cantonment MLA Lasya Nanditha

Cantonment MLA Lasya Nanditha : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె వెళ్తున్నకారు శుక్రవారం వేకువజామున ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడిక్కకడే మరణించారు. స్థానికులు హుటాహుటీన లాస్య నందితను, కారు డ్రైవర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే లాస్య నందిత మరణించినట్లు వెల్లడించారు.

కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే, డ్రైవర్ పరిస్థితికూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు ప్రమాదం సమయంలో డ్రైవర్, లాస్య నందిత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదం సమయంలో లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని సమాచారం. సీటుబెల్టు పెట్టుకొని ఉంటే ఆమె గాయాలతో బయటపడేదని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Also Read : ప్రేమను రిజెక్ట్ చేశాడని గురువుని టార్గెట్ చేసిన యువతి.. ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..

గతేడాది ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి, ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. లాస్య నందిత మృతితో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో విషాదం నెలకొంది. ఇటీవల నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా నార్కెట్ పల్లి వద్ద లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఆమె కారు ప్రమాదంలో మృతి చెందారు.

లాస్యను వెంటాడిన వరుస ప్రమాదాలు ..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లాస్య నందిత విజయం సాధించిన నాటినుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే వచ్చాయి. గతేడాది డిసెంబర్ నెలలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్ డోర్లు పగలగొట్టి లాస్య నందితను సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈనెల 14న నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హాజరై వస్తుండగా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆమె స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటన జరిగి పదిరోజులు గడవక ముందే శుక్రవారం తెల్లవారు జామున ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు.